పెండ్లికి నిరాకరించినందుకు.. ఫినాయిల్ తాగింది..

పెండ్లికి నిరాకరించినందుకు.. ఫినాయిల్ తాగింది..

 హైదరాబాద్ : ప్రేమించిన యువకుడు పెండ్లికి నిరాకరించడంతో ఓ యువతి పోలీస్ స్టేషన్‌లో ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కర్మన్‌ఘాట్ నందనవనం కాలనీకు చెందిన సత్తయ్య కుమార్తె వెన్నెల(20), కవాడిగూడ గొల్లకుర్మ కాలనీకు చెందిన బాబూరావు కుమారుడు కిషోర్‌ ను గత కొంతకాలంగా ప్రేమిస్తుంది. ఈ క్రమంలో ఇటీవల యువతి పెండ్లి చేసుకోమని కిషోర్‌ను అడుగగా అందుకు నిరాకరించాడు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై రవీందర్ శుక్రవారం సాయంత్రం యువకుడిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సమయంలో యువతి పోలీస్ స్టేషన్ బాత్‌రూంలో ఉన్న ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన పోలీసులు బాధితురాలిని గాంధీ దవాఖానకు తరలించారు. ఏసీపీ డీవీ ప్రదీప్ కుమార్ రెడ్డి స్టేషన్‌కు వచ్చి ఘటనపై ఆరా తీశారు.