ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

  లంగర్‌హౌస్‌: వివాహేతర సంబంధం కారణంగా ఓ యువకుడు హత్యకు గురైన సంఘటన లంగర్‌హౌస్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. లంగర్‌హౌస్‌ డిఫెన్స్‌ కాలనీకి చెందిన సయ్యద్‌ ఇమ్రాన్‌(23), గౌసాహి మసీదు ప్రాంతానికి చెందిన షబ్బీర్‌ ప్రాణ స్నేహితులు. వీరు క్యాబ్‌ డ్రైవర్లుగా పని చేస్తున్నారు. షబ్బీర్‌కు రెండున్నరేళ్ల క్రితం వివాహం జరుగ్గా, ఇమ్రాన్‌కు రెండు నెలల క్రితం వివాహం జరిగింది. తరచూ ఒకరి ఇంటికి ఒకరు రాకపోకలు సాగించేవారు.

దీనిని ఆసరాగా తీసుకున్న ఇమ్రాన్‌ షబ్బీర్‌ భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. గత నెల 24న దీనిని గుర్తించని వారి స్నేహితుడు షబ్బీర్‌ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో రెండు రోజుల క్రితం భార్యను పుట్టింటికి పంపించిన షబ్బీర్‌ సోమవారం మధ్యాహ్నం ఇమ్రాన్‌ను తన ఇంటికి పిలిపించాడు. వివాహేతర సంబంధంపై గొడవ కావడంతో ఇమ్రాన్‌ అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేయగా కొబ్బరి బోండాల కత్తితో షబ్బీర్‌ అతడిని వెంబడించి నరికి చంపాడు. వీరి మధ్య డబ్బుల విషయమై కూడా గొడవలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు  సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చూరీకి తరలించారు. కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నారు.