ప్రేమను నిరాకరించాడని డాక్టర్ ఆత్మహత్య

ప్రేమను నిరాకరించాడని డాక్టర్ ఆత్మహత్య

 హైదరాబాద్ : ఇష్టపడ్డ వ్యక్తి తన ప్రేమను నిరాకరించడంతో మనస్తాపం చెందిన ఓ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగింది. సీఐ సైదయ్య తెలిపిన వివరాల మేరకు.. జగిత్యాల జిల్లాకేంద్రానికి చెందిన రాజన్న, గంగవ్వ దంపతుల కుమార్తె గీతాకృష్ణా(26) దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ ఎల్‌బీనగర్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో దంతవైద్యురాలిగా పనిచేస్తున్నది. 


తన స్నేహితుడు నరేశ్‌కు ఫోన్ చేసి ప్రేమిస్తున్నట్టు చెప్పగా.. ఆయన నిరాకరించాడు. దీంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని గీతాకృష్ణ నరేశ్‌కు చెప్పింది. వెంటనే నరేశ్ గీత సోదరి రమ్యకృష్ణకు ఫోన్ చేసి విషయాన్ని వివరించారు. ఆమె వెంటనే దిల్‌సుఖ్‌నగర్‌లోని గీత స్నేహితురాలికి సమాచారం ఇచ్చి హాస్టల్‌కు వెళ్లి చూడాలని కోరారు. గీత స్నేహితురాలు హాస్టల్‌కు వచ్చి పనిమనిషితో కలిసి గది తలుపుతట్టగా తీయలేదు. దీంతో అనుమానం వచ్చి వెంటనే హాస్టల్ నిర్వాహకుడు శ్రీనివాస్‌కు సమాచారం అందించగా, ఆయన పోలీసులకు విషయాన్ని తెలిపారు.

పోలీసులు వచ్చి గది తలుపులు పగులగొట్టి చూడగా అప్పటికే గీతాకృష్ణ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. పోలీసులకు హాస్టల్ గదిలో సూసైడ్‌నోట్ దొరికింది. తన చావుకు ఎవరూ కారణం కాదని, ఈ సమాజంలో తాను ఉండలేనని.. అమ్మనాన్నా నన్ను క్షమించండి అంటూ అందులో రాసింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న చిన్ననాటి స్నేహితుడు నరేశ్‌ను తాను ప్రేమించానని.. అతను చాలా మంచివాడని పేర్కొన్నది. గీత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.