ప్రేమోన్మాది చేతిలో విద్యార్థిని బలి

ప్రేమోన్మాది చేతిలో విద్యార్థిని బలి

 హైదరాబాద్‌: ఇద్దరూ పదవ తరగతి చదువుతూ ఒకే దగ్గర ట్యూషన్‌కు వెళ్లారు. అక్కడ ఏర్పడ్డ చనువు ప్రేమగా మారింది. రెండేళ్లు ఇద్దరి మధ్య సాగిన ప్రేమ వ్యవహారం మనస్పర్థలు రావడంతో దూరమయ్యారు. తన ప్రేమను నిరాకరిస్తుందని కసి పెంచుకున్న ఆ ప్రేమోన్మాది మాట్లాడదామని పిలిచి గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు.ఈ హృదయ విదారక సంఘటన ఓయూ పోలీసు స్టేషన్‌ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. బౌద్ధనగర్‌ డివిజన్‌ పరిధిలోని అంబర్‌నగర్‌లో బీఎస్‌ఎన్‌ ఉద్యోగి హరిప్రసాద్‌ తన భార్య రేవతి, కుమార్తెలు అనూష (16), గ్రీష్మలతో కలిసి నివాసముంటున్నాడు. కాగా హరిప్రసాద్‌కు ఇటీవలే విజయవాడకు బదిలీ అవడంతో, కుటుంబాన్ని ఇక్కడే ఉంచి తను మాత్రం విజయవాడ వెళ్లివస్తున్నాడు.

హరిప్రసాద్‌ పెద్ద కూతురు అనూష నారాయణగూడలోని నారాయణ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. కాగా ఇదే ప్రాంతంలో నివాసముండే ఆరెపల్లి రవీందర్‌ కుమారుడు ఆరెపల్లి వెంకటేశ్‌ (19) సైతం హిమాయత్‌నగర్‌లోని న్యూచైతన్య జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నాడు. పక్కపక్క వీధుల్లో నివాసముండే వెంకటేష్, అనూషలు గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వెంకటేశ్‌ ప్రవర్తనతో విసుగుచెందిన అనూష గత ఆర్నెళ్లుగా అతనితో దూరంగా ఉంటోంది. తనను వదిలేయాలని కోరడమే కాకుండా అతని ప్రేమను నిరాకరిస్తూ వస్తోంది.

దీంతో వెంకటేశ్‌ అనూషపై కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకుని మంగళవారం రాత్రి మాట్లాడాల్సి ఉందని చెప్పి ఓయూ దూర విద్యా కేంద్రం సమీపంలోని క్వార్టర్ల వద్దకు పిలిచాడు. అతని మాటలు నమ్మిన అనూష అక్కడకు వెళ్లింది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో వెంకటేశ్‌ ముందుగా వేసుకున్న ప్రణాళికలో భాగంగా తన వెంట తెచ్చుకున్న బ్లేడుతో ఆమె గొంతు కోశాడు. అనూష పెద్దగా అరుస్తూ కుప్పకూలిపోయింది.