ప్రియుడితో కలిసి భర్తను హత్య ..

ప్రియుడితో కలిసి భర్తను హత్య ..

 హిమాయత్‌నగర్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసేందుకు ఓ భార్య వేసిన పథకం బెడిసికొట్టింది. ఈ సంఘటన నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్ స్పెక్టర్ బండారి రవీందర్ కథనం ప్రకారం కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాలోని ఔరండ్ తెహసిల్ గ్రామానికి చెందిన జ్ఞానేశ్వర్ బ్రతుకుదెరువు నిమిత్తం నగరానికి వచ్చి హైదర్‌గూడలోని ముత్యాల బాగ్‌లో కుటుంబసభ్యులతో కలిసి ఉంటున్నాడు. స్థానికంగా ఉన్న ఓ టిఫిన్ సెంటర్‌లో జ్ఞానేశ్వర్ పనిచేస్తుండగా అతని భార్య సునీత (31) ఓ ప్రైవేటు సంస్థలో హౌస్ మెయిడ్‌గా విధులు నిర్వహిస్తోంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. 


మేడ్చల్ జిల్లా యాప్రాల్ జె.జె.నగర్‌కు చెందిన తోటి ఉద్యోగి బి.శ్రీనివాస్ మూర్తితో సునీతకు పరిచయం ఏర్పడింది. ఇది వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన సునీత ఆమె ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు పథకం వేసింది. అందులో భాగంగా ఈ నెల7న మద్యం తాగి ఇంటికి వచ్చిన జ్ఞానేశ్వర్ కు నిద్రమాత్రలు ఇచ్చింది. అతడు నిద్రలోకి జారుకున్నాక ప్రియుడు శ్రీనివాస్ మూర్తికి ఫోన్ చేసి సమాచారం అందించింది. శ్రీనివాస్‌మూర్తి తన మిత్రుడైనా వెంకటేశ్ ఆటోడ్రైవర్ సాయంతో కీసర అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లి హత్య చేయాలని ప్రణాళిక రూపొందించుకొని ఏపి 28 టీ.ఇ 3960 నంబర్ గల ఆటోలో జ్ఞానేశ్వర్ తీసుకు వెళ్లారు. 

ఇసీఎల్ ఎక్స్‌రోడ్ సమీపంలో టీఎస్‌ఇఎఫ్-2889 కారును తీసుకుని శ్రీనివాస్ మూర్తి అక్కడ వేచి ఉన్నాడు. ఆటోలో నుంచి కారులోకి జ్ఞానేశ్వర్‌ను ఎక్కించుకొని కొంత దూరం వెళ్లిన తరువాత మెలకువ వచ్చిన జ్ఞానే శ్వర్ వారి నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్ర యించాడు. రంగంలోకి దిగిన పోలీసులు సునీత, ఆమె ప్రియుడు శ్రీనివాస్ అతనికి సహకరించిన ఆటోడ్రైవర్ వెంకటేశ్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.