సంతానం కలగడం లేదని.. బతికుండగానే చితికి..

సంతానం కలగడం లేదని.. బతికుండగానే చితికి..

 పాట్నా : బీహార్ రాజధాని పాట్నాకు 47 కిలోమీటర్ల దూరంలోని ఆరాలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళకు సంతానం కలగడం లేదని బతికుండగానే అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని కొంతమంది మానవతామూర్తులు పోలీసులకు తెలియజేయడంతో.. బాధిత మహిళ ప్రాణాలతో బయటపడింది. రవీంద్ర ఠాకూర్, లక్ష్మీదేవీ(35) దంపతులు. వీరికి 2001లో వివాహమైంది. లక్ష్మీదేవీకి అనారోగ్య సమస్యలు ఉండడం వల్ల సంతానం కలగడం లేదు. దీంతో లక్ష్మీదేవీకి అత్తమామలు, ఆడపడుచులతో పాటు భర్త వేధింపులు ఎక్కువ అయ్యాయి. 


ఇక సోమవారం తనను అత్తమామలు, భర్త దారుణంగా హింసించి కొట్టారు. ఆ తర్వాత ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో.. లక్ష్మీదేవీ చనిపోయిందని భావించి అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని కొందరు వ్యక్తులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా వారు అక్కడికి హుటాహుటిన చేరుకొని లక్ష్మీదేవీ ప్రాణాలు కాపాడారు. పోలీసులు చేరుకునే లోపే రవీంద్ర ఠాకూర్ కుటుంబ సభ్యులు పరారీ అయ్యారు. లక్ష్మీదేవీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.