సికింద్రాబాద్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం

సికింద్రాబాద్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం

 మారేడ్‌పల్లి: సికింద్రాబాద్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన బస్సు పాదచారుడిని ఢీకొట్టి డివైడర్ దాటుకొని ఎదురుగా వస్తున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పాదచారి అక్కడికక్కడే మృతిచెందగా.. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. గోపాలపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని క్లాక్‌టవర్ వద్ద శనివారం సాయంత్రం 6 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకొన్నది. పోలీసులు, ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్ డిపో-2కు చెందిన బస్సు జేఎన్టీయూ నుంచి సికింద్రాబాద్‌కు వస్తున్నది. క్లాక్‌టవర్ వద్దకు రాగానే అదుపుతప్పి గుర్తుతెలియని పాదచారిని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం డివైడర్ దాటుకొని ఎదురుగా వస్తున్న వాహనాలపైకి దూసుకెళ్లి ధ్వంసం చేస్తూ మెట్రో పిల్లర్ నంబర్ 24ను ఢీకొట్టి నిలిచిపోయింది. ఆటోలో ఉన్న ఇద్దరికి, బైక్‌పై ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. 


సమాచారం అందుకొన్న గోపాలపురం, మార్కెట్ పోలీసులు గాయపడినవారిని చికిత్స నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్ అహ్మద్‌ను అ దుపులోకి తీసుకొన్నారు. బ్రేకులు ఫెయిలవటం తోనే బస్సును కంట్రోల్ చేయలేకపోయానని బస్సు డ్రైవర్ అహ్మద్ చెప్పారు. కాగా, సంఘటనాస్థలానికి వచ్చిన ఆర్టీసీ ఆర్‌ఎం రమాకాంత్.. ప్రమాదం వివరాలను అడి గి తెలుసుకొన్నారు. ఆరేండ్ల క్రితం కొనుగోలు చేసిన ఈ బస్సు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నదని, బ్రేక్ మీటర్‌లో ఎయిర్ ప్రెషర్ ఆరు పాయింట్లు చూపిస్తున్నందున బ్రేకులు ఫెయిల్ కాలేదని మెకానిక్‌లు తేల్చినట్టు చెప్పారు. మృతుడి కుటుం బానికి పరిహారం అందిస్తామని, గాయపడినవారి వైద్యఖర్చు లు భరించేందుకు అధికారులకు నివేదిస్తానని హామీఇచ్చారు.