సబ్‌జైలు నుండి ఇద్దరు నిందితులు పరారు

సబ్‌జైలు నుండి ఇద్దరు నిందితులు పరారు

 న్యూఢిల్లీ: సబ్‌ జైలు సిబ్బంది కళ్లలో మిరియాలపొడి, టీ జల్లి ఇద్దరు నిందితులు తప్పించుకుపారిపోయారు. మరో నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించి జైలు సిబ్బందిపై దాడి చేశాడు. ఈ సంఘటన గురువారం పాగ్వారా సబ్‌జైలులో జరిగింది. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. పారిపోయిన వారిని బాబియానాకు చెందిన అమన్‌ప్రీత్‌, సమ్‌రారుకి చెందిన రాజ్విందర్‌ సింగ్‌గా అధికారులు గుర్తించారు. అమన్‌ప్రీత్‌ను నవంబరు 24న ఐపిసి సెక్షన్‌ 326 కింద అరెస్టు చేయగా, రాజ్విందర్‌సింగ్‌ను నవంబర్‌ 29న అరెస్టు చేసినట్లు తెలిపారు. పారిపోవడానికి ప్రయత్నించిన మూడో నిందితుడు పవన్‌ కుమార్‌ను జైలు సెంట్రీ అదుపులోకి తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. 

కాగా, ఈ ప్రయత్నంలో సెంట్రీ హర్పాల్‌ సింగ్‌కు, నిందితుడు పవన్‌ కుమార్‌కు స్వల్ప గాయాలయినట్లు డిఎస్‌పి వెల్లడించారు. ఉదయం ఏడు గంటలకు అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కాబుల్‌ సింగ్‌ కోసం గేట్లు తెరిచిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, జైలు సూపరింటెండెంట్‌ ఎస్‌పి కన్నా, అదనపు డిజిపి ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. నిందితులు పారిపోయే ప్రయత్నంలో ఎవరైనా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విచారణ నివేదికను రెండు రోజుల్లోగా ఎడిజిపి ఇక్బాల్‌ప్రీత్‌ సింగ్‌కు అందజేస్తామని కన్నా పేర్కొన్నారు. సబ్‌జైలులో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలు కూడా కొన్ని రోజులుగా పనిచేయట్లేదని , ఆ విషయంపై కూడా విచారణ జరుపుతామని అన్నారు.