వ్యభిచార నిర్వాహకుల గ్యాంగ్‌పై పీడీ యాక్ట్

వ్యభిచార నిర్వాహకుల గ్యాంగ్‌పై పీడీ యాక్ట్

 యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి పుణ్యక్షేత్రంలోని గణేశ్‌నగర్‌లో వ్యభిచారం చేయిస్తున్న నలుగురు గ్యాంగ్ సభ్యులపై పీడీయాక్ట్ నమోదు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ తెలిపారు. వ్యభిచార నిర్వాహకుల ఆర్గనైజర్లు గ్యాంగ్‌గా ఏర్పడి బలవంతంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఆర్గనైజర్లుగా మారి వ్యభిచార గృహాలను నిర్వహిస్తున్నట్లుగా ఆయన వివరించారు. యాదాద్రి పవిత్రతకు, మహిళలకు భద్రత లేకుండా గ్యాంగ్‌గా మారిందని చెప్పారు.

గణేశ్‌నగర్‌లో నివసించే ఈ నలుగురు కొంతకాలంగా సిండికేట్ గ్యాంగ్‌గా ఏర్పడ్డారని చెప్పారు. కంసాని సంధ్య(55) ఆధ్వర్యంలో ఏర్పడిన గ్యాంగ్ ఎంతోమంది మైనర్ బాలికలు, మహిళలను ఈ వృత్తిలోకి దించి వ్యభిచారం చేయిస్తుందని తెలిపారు. వీరి గ్యాంగ్‌లో కంసాని శశిరేఖ(55), కంసాని బుచ్చమ్మ(45), కంసాని నిర్మల(42)లు డబ్బులు, లగ్జరీ లైఫ్‌ను ఆశ చూపిస్తూ బలవంతంగా వ్యభిచారంలోకి దించుతున్నారని తెలిపారు. తన ఇంటినే వ్యభిచార గృహంగా మార్చిందని చెప్పారు. విటుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు గుచ్చుతుందని తమ పరిశోధనలో తేలిందని చెప్పారు. ఎంతోమంది యువతులు తమ విలువైన జీవితాలను సంధ్య వల్ల నష్టపోయారని తెలిపారు. అనేక సార్లు పోలీసులతో అరస్టై జ్యుడీషియల్ కస్టడీలో కూడా ఉన్నదని చెప్పారు. పోలీసులు అనేక సార్లు ఆమె ఇంటిపై దాడులు చేసి విటులు, సెక్స్‌వర్కర్లను అరెస్టు చేసిన విషయాన్ని ఉదహరించారు. అంతేకాకుండా స్వచ్చంధ సంస్థల ప్రతినిధులతో పడుపు వృత్తి చేయించవద్దనే విషయంపై అవగాహన కల్పించామని, అయినా ఫలితం లేకుండా పోయిందన్నారు.

ఈ నెల 3న కూడా అరస్టైందని చెప్పారు. సంధ్య చర్యల వల్ల గణేశ్‌నగర్‌లో నివసించే యువతులు కళాశాలలకు వెళ్లడానికి భయబ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. వీరి నుంచి యువతులకు రక్షణ కల్పించడంతో పాటు గణేశ్‌నగర్‌లో నివసించే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడం కోసం పీడీయాక్ట్ట్ నమోదు చేశామని తెలిపారు. కోర్టు ఉత్తర్వుల మేరకు చంచల్‌గూడ జైలుకు రిమాండ్ చేసినట్లు చెప్పారు.యాదగిరిగుట్టలో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీపీ మహేశ్‌భగవత్‌కు యాదగిరిగుట్ట ఏసీపీ సముద్రాల శ్రీనివాసాచార్యులు, సీఐ అశోక్‌కుమార్ అందజేసి వ్యభిచార నిర్మూలన కోసం గట్టి కృషి చేస్తున్నారు. గుట్టలో వ్యభిచార నిర్వాహకుల ఆటకట్టించేందుకు నలుగురు గ్యాంగ్ సభ్యులపై విధించిన పీడీయాక్డుతో వ్యభిచార నిర్వాహకుల్లో భయాన్ని కలిగించింది.