వ్యక్తిని హత్య చేసిన డీజే ఆపరేటర్‌

వ్యక్తిని హత్య చేసిన డీజే ఆపరేటర్‌

 న్యూఢిల్లీ : అర్ధరాత్రి ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. తనకు నచ్చిన పాట పెట్టమని అడిగినందుకు ఓ డీజే ఆపరేటర్‌ పబ్‌కు వచ్చిన వ్యక్తిని హత్యచేశాడు. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ ఢిల్లీలోని పంజాబీ భాగ్‌ సమీపంలోని రఫ్తార్‌ పబ్‌లో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత విజయ్‌పాల్‌ సింగ్‌ అనే వ్యక్తి తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవడానికి తన మిత్రులతో కలిసి వచ్చాడు. ఈ సందర్భంగా విజయ్‌పాల్‌ తనకు నచ్చిన పాట పెట్టాంటూ డీజే ఆపరేటర్‌ను కోరగా, కవ్వింపు చర్యలకు దిగాడు.

దీంతో విజయ్‌పాల్‌, డీజే ఆపరేటర్‌ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ దాడిలో డీజే ఆపరేటర్‌ బలమైన వస్తువుతో సింగ్‌ తలపై బలంగా కొట్టడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి స్నేహితుల ఫిర్యాదు మేరకు పబ్‌ యాజమాన్యంతోపాటు, డీజే ఆపరేటర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.