యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు

యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు

  హైదరాబాద్: రష్యాతో పాటు మన దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి యువతులను రప్పించి... వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న అంతర్జాతీయ వ్యభిచార ముఠాను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాత నేరస్తులు తమ వృత్తిని మానుకోకుండా... ఖరీదైన ఇండ్లను అద్దెకు తీసుకొని ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు.డీసీపీ రాధాకిషన్‌రావు కథనం ప్రకారం... చెన్నయ్‌కు చెందిన కురెయిన్ తారయెల్ జాకబ్ అలియాస్ అలెక్స్ 15 ఏండ్ల క్రితం జీవనోపాధి కోసం నగరానికి వచ్చి రెంటల్(అద్దె) వ్యాపారాన్ని నిర్వహించాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడడంతో.. ఆ వ్యాపారంలో వచ్చే డబ్బు సరిపోలేదు. దీంతో అనంతపూర్‌కు చెందిన చెన్నైలో నివాసముండే రాఘవేందర్‌రెడ్డి అలియాస్ రఘువీర్‌రెడ్డితో పరిచయం అయ్యింది.


ఇద్దరు కలిసి 2011లో హైదరాబాద్ బంజారాహిల్స్‌లో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తూ పట్టుబడ్డారు. అలెక్స్ జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత తన రెంటల్ వ్యాపారాన్ని కొన్ని రోజులు కొనసాగించాడు. ఆ తరువాత ఈస్ట్‌గోదావరికి చెందిన యామల మేరి, బీహార్‌కు చెందిన పంకజ్‌కుమార్ మండల్‌తో కలిసి బంజారాహిల్స్ ఫర్చూన్ హోటల్ సమీపంలో దుర్గా ఎన్‌క్లేవ్‌లో రూ. 30 వేలకు ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నారు.

ఢిల్లీ, ముంబయి, కోల్‌కత్తతో పాటు రష్యా, ఉజ్జకిస్తాన్ తదితర ప్రాంతాల నుంచి యువతులను రోజుకు రూ. 16 వేలు ఇచ్చేవిధంగా ఒప్పందం చేసుకొని హైదరాబాద్‌కు తీసుకొస్తారు. ఇలా హైఫైగా గృహాన్ని నిర్వహిస్తూ వచ్చే విటుల వద్ద నుంచి వేల రూపాయలు వసూలు చేస్తుంటారు. ఈ క్రమంలో యామల మేరి, పంకజ్‌కుమార్ మండల్‌లు విటులను వ్యభిచార గృహానికి రప్పించే పనులు నిర్వహిస్తుంటారు.
ఈ క్రమంలో విశ్వసనీయ సమాచారంతో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ గట్టు మల్లు బృందం ఆ వ్యభిచార గృహంపై దాడి చేశారు. అలెక్స్, మేరి, పంకజ్ నిర్వాహకులతో పాటు రష్యా, కోల్‌కత్త, ఢిల్లీకి చెందిన ముగ్గురు యువతులను రెస్క్యూ చేశారు. వీరి వద్ద నుంచి రూ. 40 వేల నగదు, కండోమ్స్, పాస్‌పోర్టు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ నిమిత్తం బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు.