10 వేల కోట్లతో విశ్వవిద్యాలయాల అభివృద్ధి

10 వేల కోట్లతో విశ్వవిద్యాలయాల అభివృద్ధి

పాట్నా: శనివారం పాట్నా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ప్రధాని ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ తన స్వాగతోపన్యాసంలో పాట్నా యూనివర్సిటీకి కేంద్ర హోదా ఇవ్వాలంటూ చేతులు జోడించి ప్రధానిని వేడుకున్నారు. దీనిపై మోదీ తనదైన రీతిలో స్పందించారు. ఇలా హోదాలు కావాలంటూ అడుగడం కాలం చెల్లిపోయిన విధానమని అన్నారు.

విశ్వవిద్యాలయాల అభివృద్ధిలో ముందడుగు కోసం తాము కృషి చేస్తున్నామని అన్నారు. ఐఐఎంలను సర్కారీ నియంత్రణల నుంచి విముక్తం చేశాం.. ఇప్పుడు విశ్వవిద్యాలయాల విషయంలోనూ అదే చేస్తున్నాం అని చెప్పారు.  విశ్వవిద్యాలయాలను సంకెళ్ల నుంచి విముక్తం చేసి రూ.10 వేల కోట్లతో కొత్తబాట పట్టిస్తానని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. 10 ప్రైవేటు, 10 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను ప్రపంచస్థాయిలో తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం నడుం బిగించిందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు.

ప్రపంచంలోని 500 ఉత్తమ వర్సిటీల్లో మనదేశానికి చెందినవీ ఉండేలా చూడాలని అన్నారు. విద్యార్థుల బుర్రల్ని సమాచారంతో నింపేయడమనే పాత పద్ధతిని విడనాడాలి వినూత్నమైన శిక్షణా విధానాన్ని తీసుకురావాలి అని ప్రధాని చెప్పారు. పదేసి ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీలను ఎంపిక చేసి రూ.10 వేల కోట్లు కేటాయిస్తాం.. ఐదేండ్లలో అవి ప్రపంచస్థాయి సాధించి చూపాలి. ఈ ఎంపిక ప్రధాని, సీఎం లేదా మరో రాజకీయ నేత చేయడు.. అర్హత కలిగిన నైపుణ్యసంస్థ ద్వారా ఇది జరుగుతుంది అని మోదీ తెలిపారు. 

బీహార్ ఘనచరిత్రను గుర్తుచేస్తూ రాష్ట్రంలో ప్రవహించే జ్ఞాననది గంగానదిలా పురాతనమైందని పేర్కొన్నారు. రాష్ట్రం సరస్వతి పూజకు అంకితమవుతున్నది.. కానీ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అని ప్రధాని అన్నారు. సీఎం నితీశ్‌కుమార్ బీహార్ అభివృద్ధికి అంకితబావంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. కేంద్రమంత్రులు రవిశంకర్‌ప్రసాద్, రాంవిలాస్ పాశ్వాన్, అశ్వినీ చౌబే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

అనంతరం ప్రధాని మోదీ సీఎం నితీశ్ వెంటరాగా పాట్నా మ్యూజియంను సందర్శించారు. పాట్నాకు 100 కిలోమీటర్ల దూరంలోని మొకామాలో అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఆ సందర్భంగా ఏర్పాటైన సభలో ప్రధాని స్థానిక మాగధి మాండలికంలో ప్రసంగించారు. నిర్ణీత గడువుతో అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నామని, ఎన్నికల సమయంలో ప్రకటించి ఆ తర్వాత మరచిపోవడం అనేది పాత పద్ధతని మోదీ అన్నారు. దీనివల్ల దేశానికి ఎంతో నష్టం జరిగిందని చెప్పారు.