ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో డిజిటల్ క్లాసులు

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో డిజిటల్ క్లాసులు

ఇప్పటివరకు విద్యార్థి, కాలేజీలకు సంబంధించి మొత్తం 22 రకాలసేవలను ఆన్‌లైన్ పరిధిలోకి తీసుకొచ్చిన ఇంటర్మీడియట్ బోర్డు డిజిటల్ పాఠాలను కూడా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికలను రూపొందిస్తున్నది. డిజిటలైజేషన్ విషయంలో ఇంటర్మీడియట్ బోర్డు ముందు వరుసలో నిలుస్తున్నది.  సిలబస్‌కు అనుగుణంగా డిజిటల్ పాఠాల బోధనకు సంబంధించిన సేవలు అందించేందుకు ఓ ప్రైవేట్ సంస్థతో ఒప్పందం చేసుకున్నది. వారి ఆధ్వర్యంలో డిజిటల్ కంటెంట్‌ను రూపొందిస్తున్నారు. డిజిటల్ పాఠాలను మరో నెలరోజుల్లో అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.

విద్యార్థులు సబ్జెక్టులను సులభంగా అర్థం చేసుకునే విధంగా డిజిటల్ పాఠాలను సృజనాత్మకంగా తీర్చిదిద్ది అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఏ అశోక్ తెలిపారు. జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్‌డ్, ఎంసెట్ వంటి ప్రవేశపరీక్షలకు ఉపయోగపడే విధంగా ఈ పాఠాలను అందుబాటులోకి తెస్తున్నారు. విషయ నిపుణులతో సబ్జెక్టులవారీగా కమిటీలను వేసి పాఠాలు రూపొందిస్తున్నారు. బోర్డు రూపొందించిన ప్రత్యేక వెబ్‌సైట్, మొబైల్‌యాప్, సీడీల రూపంలో కూడా పాఠాలను అందుబాటులో ఉంచనున్నారు.

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ అందజేస్తారు. ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఈ డిజిటల్ పాఠాలు కావాలనుకుంటే ప్రతి విద్యార్థికి రూ.350 చెల్లించాల్సి ఉంటుందని బోర్డు కార్యదర్శి అశోక్ పేర్కొన్నారు.