ఇంటర్ విద్యలో సంస్కరణలు

ఇంటర్ విద్యలో సంస్కరణలు

నేడు ఇంటర్మీడియెట్ బోర్డు 2వ సమావేశంలో కడియం శ్రీహరి పాల్గొని.. బోర్డు ప్రవేశపెట్టిన పలు తీర్మాణాలను ఆమోదించారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్యలో అనేక సంస్కరణలు చేపట్టామని, ఇంటర్ విద్యను ఉచిత విద్య చేశామని, ఉచితంగా పుస్తకాలు ఇస్తున్నామని కడియం తెలిపారు. 325 కోట్ల రూపాయలను ఖర్చు చేసి 404 కాలేజీల్లో ల్యాబ్స్, లైబ్రరీలు, మౌలిక వసతులు కల్పించామన్నారు.  రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలన్నింటికి పక్కా భవనాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతీ కాలేజీలో సీసీ కెమెరాలు, బయో మెట్రిక్ మెషీన్లు, ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఇంటర్ బోర్డులో 22 సర్వీస్ లను ఆన్ లైన్ చేశామని, త్వరలో మరిన్ని సేవలను కూడా ఆన్ లైన్ చేస్తామన్నారు. 

ఇంటర్ బోర్డును దేశంలోనే ఉత్తమమైన బోర్డుగా తీర్చిదిద్దుతామని కడియం స్పష్టం చేశారు. విద్యాశాఖ చేపట్టిన పలు సంస్కరణల వల్ల జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల నమోదు శాతం పెరిగిందన్నారు. ఇప్పటికే దేశంలో బెస్ట్ డిజిటలైజ్డ్ బోర్డుగా వరల్డ్ ఎడ్యుకేషన్ సమ్మిట్ లో తెలంగాణ ఇంటర్ బోర్డుకు అవార్డు లభించిందని కడియం పేర్కొన్నారు. ఇందుకు కృషి చేసిన ఇంటర్ బోర్డు అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు. అయితే అధికారులు ఇంతటితో సంతృప్తి చెందకుండా మరింత కష్టపడాలని సూచించారు.

ఇంటర్ బోర్డు సభ్య సమావేశం ప్రతి ఆరు నెలలకొకసారి జరగాల్సి ఉండగా..పలు కారణాల వల్ల నిర్ణీత సమయంలో సమావేశం కాలేదన్నారు. ఇకనుంచి ప్రతి ఆరు నెలలకొకసారి ఇంటర్ బోర్డు సభ్య సమావేశం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా బోర్డు సభ్యులను కూడా ప్రస్తుత అవసరాల మేరకు మార్చుతామని తెలిపారు. వృత్తివిద్య కోర్సులను మరింత పటిష్టం చేసి, కోర్సు పూర్తి చేసిన వారికి జాబ్ వచ్చే విధంగా కోర్సులను డిజైన్ చేస్తామన్నారు. దీనికోసం జేఎన్టీయూ, వైద్య, ఆరోగ్య శాఖ, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్చన్ ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నామని కడియం వెల్లడించారు. వచ్చే రెండు నెలల్లో ఈ కమిటీ నివేదిక ఇవ్వాలని, దానికనుగుణంగా కోర్సులు రూపొందించి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకొస్తామన్నారు. అదే సమయంలో ఆదరణలేని వృత్తివిద్య కోర్సులను కూడా తొలగిస్తామని చెప్పారు.

ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఉన్నత విద్య కమిషనర్ వాణిప్రసాద్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, పాఠశాల విద్య డైరెక్టర్ కిషన్, తెలంగాణ విశ్వవిద్యాలయాల వీసీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.