మత ఉగ్రవాదంపై జెఎన్‌యూలో కోర్సు

మత ఉగ్రవాదంపై జెఎన్‌యూలో కోర్సు

 న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో మత ఉగ్రవాదంపై కోర్సు ప్రారంభించేందుకు అకడెమిక్‌ కౌన్సిల్‌ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తోంది. జెఎన్‌యూలో త్వరలో ఏర్పాటు కానున్న సెంటర్‌ ఫర్‌ నేషనల్‌ సెక్యూరిటీ స్టడీస్‌ (సిఎన్‌ఎస్‌ఎస్‌)లో భాగంగా మత ఉగ్రవాదాన్ని ఓ సబ్జెక్ట్‌గా చేర్చనున్నట్టు చెబుతున్నారు. శుక్రవారం జరిగిన జెఎన్‌యూ అకడెమిక్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చినట్టు ప్రొఫెసర్‌ సుధీర్‌ కె సుతార్‌ తెలిపారు. ఆ సమావేశానికి సుతార్‌ ప్రత్యేక ఆహ్వానితుడిగా వెళ్లారు. ఈయన జెఎన్‌యూ టీచర్స్‌ అసోసియేషన్‌ నాయకుడు కూడా..ఇస్లామిక్‌ ఉగ్రవాదం అనే సబ్జెక్ట్‌ను ప్రతిపాదించగా సభ్యుల్లో ఎక్కువమంది వ్యతిరేకించినట్టు ఆయన చెప్పారు. 

ఏ మతాన్నీ ఉగ్రవాదంతో కలిపి చెప్పొద్దని వారు సూెచించినట్టు తెలిపారు. మత ఉగ్రవాదం అనడానికి ఏకాభిప్రాయం కుదిరినట్టు చెప్పారు. ఈ ప్రతిపాదనపై అభ్యంతరాలను స్వీకరించనున్నట్టు ఆయన తెలిపారు. కౌన్సిల్‌లోని మరో సభ్యుడు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద చర్యలు మతంతో ముడిపడి ఉన్నాయనడానికి మెజారిటీ సభ్యులు మద్దతు తెలపారని చెప్పారు. కోర్సు పేరు ఇస్లామిక్‌ టెర్రరిజమ్‌ నుంచి ఇస్లామిస్ట్‌ టెర్రరిజమ్‌గా మార్చనున్నట్టు మరో సభ్యుడు అశ్వినీ మహాపాత్ర తెలిపారు. ఇస్లామిస్ట్‌ టెర్రరిజమ్‌ అనే పదానికి ప్రపంచవ్యాప్తంగా ఆమోదం ఉన్నదని, ఇస్లాంతో ముడిపెట్టి కొందరు తమ లక్ష్యాలను నిర్దేశించుకుంటున్నారని ఆయన అన్నారు.

హిందూత్వ టెర్రరిజమ్‌గానీ, క్రిస్టియన్‌ టెర్రరిజమ్‌గానీ ఏమీ లేవని ఆయన అన్నారు. హిందూత్వ టెర్రరిజమ్‌ అనే దానిని మైనారిటీల ఓట్ల కోసం కాంగ్రెస్‌ ప్రచారం చేస్తున్నదని ఆయన విమర్శించారు. అకడెమిక్‌ కోర్సుల పేరుతో ఇస్లామోఫోబియాను ప్రచారం చేయడం వికృత చేష్ట అని జెఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు గీతాకుమారి దుయ్యబట్టారు. ఉగ్రవాదాన్ని సాధారణ పద్ధతిలో అధ్యయనం చేయకుండా కోర్సుల కోసమని ఆర్‌ఎస్‌ఎస్‌ - బిజెపిలకు ఎన్నికల ప్రచారానికి ఉపయోగించే సామగ్రిని సిద్ధం చేస్తున్నట్టుగా ఉన్నదని ఆమె విమర్శించారు. అయితే, అటువంటి కోర్సుకు ప్రతిపాదన ఏమీ లేదని సిఎన్‌ఎస్‌ఎస్‌ నమూనా కోసం ఏర్పాటైన కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్‌ అజరు దూబే అన్నారు. దీనిపై మరింత వివరణ కోసం ప్రశ్నించగా ఆయన సమాధానాలివ్వలేదు. జెఎన్‌యూలోని ముఖ్య అధికారులంతా దీనిపై స్పందించేందుకు వెనకాడుతున్నారు. దాంతో, ఓ ప్రణాళికగా ఎవరో వీరిని ఆదేశిస్తూ తాము అనుకున్నది జరిగే వరకూ ఏమీ మాట్లాడకుండా ఉండాలని ఆంక్షలు విధిస్తున్నట్టు అర్థమవుతోంది.