రైల్వే విద్యాసంస్థలు మూతపడుతున్నాయి

రైల్వే విద్యాసంస్థలు మూతపడుతున్నాయి

హైదరాబాద్: ఒకప్పుడు రైల్వే విద్యాసంస్థల్లో సీట్లు కోసం ఉద్యోగుల పిల్లలు పోటీపడేవారు. కానీ నేడా పరిస్థితి మారి విద్యార్థులు లేక విద్యాసంస్థలు వెలవెలబోతున్నాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న విద్యాసంస్థలు మూతపడుతున్నాయి.మొదట రైల్వే ఉద్యోగుల పిల్లలకు మాత్రమే ఈ విద్యాసంస్థల్లో ప్రవేశాలిచ్చేవారు. క్రమేపీ అడ్మిషన్లు తగ్గిపోవడంతో బయటివారికి కూడా అవకాశం కల్పిస్తున్నారు. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో విద్యార్థుల చేరడం లేదు. దీంతో విద్యాసంస్థల మూసే పరిస్థితి నెలకొన్నది.

దక్షిణమధ్య రైల్వే పరిధిలో ఐదు డివిజన్లలో ఉన్న పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆశించిన స్థాయిలో లేకపోవడంతో వాటిని మూసేసేందుకు రైల్వేశాఖ సిద్ధపడుతున్నది. ఆయా పాఠశాలల్లో పనిచేసే 172 మంది ఉపాధ్యాయుల, ఇతర సిబ్బంది సేవలను రైల్వేశాఖ ఇతర విభాగాల్లో వినియోగించుకుంటున్నది.

క్లర్కులుగా, ఆఫీస్ సూపరింటెండెంట్లుగా, నాలుగో తరగతి ఉద్యోగులైతే ఆయా క్యాటగిరీల్లో డిప్యూటేషన్‌పై విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందిని నియమించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న 12 పాఠశాలలకు గానూ ఇప్పటి వరకు 5 పాఠశాలలు, ఉన్న నాలుగు జూనియర్ కాలేజీల్లో 2 జూనియర్ కాలేజీలు మూత పడ్డాయి. ఉన్న ఒక్కగానొక్క రైల్వే డిగ్రీ కాలేజీ దయనీయస్థితికి చేరుకొని మూతపడేందుకు సిద్ధంగా ఉంది.