రాష్ట్రంలో డిగ్రీ సీట్ల తగింపు

రాష్ట్రంలో డిగ్రీ సీట్ల తగింపు

హైదరాబాద్ :తెలంగాణ లో డిగ్రీ సీట్లను తగ్గించడం మీద రాష్ట్ర ఉన్నత విద్యామండలి దృష్టి సారించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 11వందల డిగ్రీకాలేజీల్లో 4.10 లక్షల సీట్లు ఉన్నాయి. గత రెండేండ్లుగా నిర్వహిస్తున్న ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌లో రెండు లక్షల సీట్లు కూడా భర్తీ కావటం లేదు. దీనితో డిగ్రీ కాలేజీల్లో కనీసం ఒక లక్ష సీట్లయినా తగ్గించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులు అభిప్రాయపడుతున్నారు. 2018-19 విద్యా సంవత్సరం నాటికి దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. అలాగే అఫిలియేషన్ సమయంలో కాలేజీల్లో విద్యా ప్రమాణాల అమలుకు పకడ్బందీ చర్యలు తీసుకునేలా విద్యామండలి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది.

దీంతో రాష్ట్రంలో ప్రైవేటు కాలేజీల్లో నాసిరకం ప్రమాణాల అంశం మీద, భవిష్యత్తులో చేపట్టవలిసిన చర్యల మీద చర్చించేందుకు త్వరలోనే వీసీలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. డిమాండ్‌కు మించిన సీట్ల వల్ల అడ్మిషన్లు లేని కాలేజీల సంఖ్య పెరిగిపోతున్నదని, విద్యాప్రమాణాలు దిగజారుతున్నాయని ఆయన చెప్పారు. కనీసం 25 శాతం సీట్లు నిండని కాలేజీలు కూడా వందల సంఖ్యలో ఉండడం విచారకరమని అన్నారు.

రాష్ట్రంలో ప్రతి ఏడాది ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత నాలుగు లక్షలలోపే ఉంటున్నది. వీరిలో లక్ష మంది ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల్లో చేరుతున్నారు. మరో పదివేలు ఐఐటీ, ఎన్‌ఐటీ, కేంద్రీయ యూనివర్సిటీలు, జాతీయ విద్యాసంస్థల వైపు వెళుతున్నారు. సుమారు 15 వేల వరకు తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, మహారాష్ట్రలలో ఇంజినీరింగ్, మెడికల్ సహా పలు డీమ్డ్ వర్సిటీల్లో వివిధ కోర్సుల్లో చేరుతున్నారు. ఇంకో పదిహేను వేలమంది రాష్ట్రంలోని డీఎడ్ కాలేజీలలో చేరుతున్నారు. వీరిని తీసేస్తే డిగ్రీ కాలేజీల్లో చేరేవారి సంఖ్య అటుఇటుగా రెండు లక్షలకు మించడం లేదు. 

2008 నుంచి రాష్ట్రంలో ప్రైవేటు డిగ్రీ కాలేజీలు కుప్పలు తెప్పలుగా పుట్టుకు వచ్చాయి. డిమాండ్ అంచనా లేకుండా అడిగిన వారిదే పాపం అన్నట్టు కాలేజీలకు అనుమతులిచ్చారు. ఫలితంగా విద్య నాణ్యత దిగజారడంతోపాటు ఉత్తీర్ణత గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం 11వందల కాలేజీలుండగా వాటిలో 20శాతం కాలేజీల్లోనే నాణ్యమైన విద్య అందుతున్నది. 30 శాతం కాలేజీల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవు.50 శాతం కాలేజీల్లో ఉత్తీర్ణత దారుణంగా ఉంది. 300 కాలేజీల్లో 25శాతం కన్నా తక్కువ సీట్లలోనే అడ్మిషన్లు జరుగుతున్నాయి. కొన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది.