విద్యా బోధనలో సరికొత్త ఒరవడి త్రీడీ పాఠాలు

విద్యా బోధనలో సరికొత్త ఒరవడి త్రీడీ పాఠాలు

  హైదరాబాద్: విద్యార్థులకు పాఠాలు బోధించడం ఎలా? లోతైన విషయాలను అర్థం చేయించడం ఎలా? నిన్నా మొన్నటి దాకా... పాఠ్యపుస్తకాల్లో రంగు రంగుల బొమ్మల్ని ముద్రించేవారు. వాటి ఆధారంగా పిల్లలకు ఆయా అంశాల పట్ల అవగాహ కల్పించేవారు టీచర్లు. కానీ ఇప్పుడు విద్యా బోధనకు, అధ్యయనానికి ఆధునిక సాంకేతికత తోడైంది. అక్షరాలు, డయాగ్రాంలే కాదు.. 2డీ, 3డీ విజువల్స్ ద్వారా విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. అలాంటి కొత్త ప్రయోగంతో ముందుకు వచ్చిందీ నెక్ట్స్ ఎడ్యుకేషన్. పాఠ్య పుస్తకాల్లో క్యూఆర్ కోడ్‌ని ప్రవేశపెట్టి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.ఖగోళ శాస్ర్తాన్ని గురించి పాఠం చెప్పే ఉపాధ్యాయుడు.. ఏవో నాలుగు మ్యాప్‌లు తెచ్చి గ్రహాలు, వాటి భ్రమణం గురించి వివరిస్తాడు. కానీ అది విద్యార్థి మెదడుకు ఎక్కకపోవచ్చు. పుస్తకంలో బొమ్మను చూపించి జీర్ణ వ్యవస్థను అర్థం చేసుకోమంటే కూడా విద్యార్థికి అర్థం కాకపోవచ్చు. కానీ వాటి స్థానంలో లైవ్ వీడియోని చూడగలితే.... త్రీడీ విజువల్‌ని వీక్షించగలితే? ఖచ్చితంగా విద్యార్థులు మరింత లోతుగా విషయాన్ని అర్థం చేసుకుంటారు. ఈ ఆలోచనతోనే క్యూఆర్ కోడ్‌తో ముందుకు వచ్చింది నెక్ట్స్ ఎడ్యుకేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.


క్యూఆర్ కోడ్‌పాఠ్య పుస్తకాల్లోని అంశాలకు క్యూఆర్ కోడ్ ద్వారా 2డీ, 3డీ యానిమేషన్స్, వీడియోలకు జత చేసింది నెక్ట్స్ ఎడ్యుకేషన్. స్మార్ట్ ఫోన్ ద్వారా విద్యార్థులు నిర్థిష్టమైన కోడ్‌ని స్కాడ్ చేసిన వెంటనే ఆ అంశానికి సంబంధించిన వీడియో ప్లే అవుతుంది. ఇది నిర్థిష్టమైన సబ్జెక్ట్ పట్ల లోతైన అవగాహనకు దోహదపపడుతుంది. పాఠ్య పుస్తకాలకు సాంకేతికతను జత చేయడం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం సాధ్యమవుతుందని నెక్ట్స్ ఎడ్యుకేషన్ సీఈఓ బియాస్ దేవ్ రల్హాన్ తెలిపారు. ఈ పద్దతి ద్వారా దాదాపు 17 లక్షల మందికి పైగా విద్యార్థులు అవకాశాన్ని వినియోగించుకోనున్నారని తెలిపారు. రోజువారి జీవితంలో ఇప్పుడు సాంకేతిక సాధనాలు కీలకంగా మారాయి. ల్యాప్‌ట్యాప్స్, టాబ్లెట్స్, పీసీలు, స్మార్ట్ ఫోన్‌ల వాడకం విస్తృతంగా పెరిగింది. ఈ సాంకేతిక అభివృద్ధిని విద్యా బోధనకు జోడించడం ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని బియాస్ అన్నారు. డిజిటల్ ఫాంలో వీక్షించే అంశాలు విద్యార్థులపై బలమైన ముద్ర వేస్తాయని, అందుకే తమ పాఠ్యపుస్తకాల్లో ముఖ్యమైన అంశాలను క్యూర్ కోడ్ ద్వారా త్రీడీ, వీడియో కంటెంట్‌తో జత చేశామని తెలిపారు. స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ వీడియోలను నేరుగా వీక్షించవచ్చన్నారు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఆర్మీతో పాటు వివిధ రాష్ర్టాల్లోని అన్ని బోర్డుల సిలబస్‌ల్లోనూ ఈ పద్ధతిని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.