ఆడపిల్లగా పుట్టడమే అవార్డు

ఆడపిల్లగా పుట్టడమే అవార్డు

 సుస్మిత సేన్‌...మాజీ విశ్వసుందరి..లింగ వివక్షకు సంబంధించిన వివాదం వచ్చినప్పుడల్లా ఈమె పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది. సున్నితమైన కామెంట్స్‌తో చెప్పాల్సిన విషయం చెబుతూ ఉంటుంది. ఈ సారి కూడా ఆ తరహాలోనే మాట్లాడింది. ఆడపిల్లగా పుట్టడమే ఓ పెద్ద పురస్కారం అని చెప్పింది. ముంబయిలో 'ఐ యామ్‌ ఉమెన్‌' పురస్కారాన్ని సుస్మిత అందుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడపిల్లగా పుట్టడమే తన జీవితంలో తాను అందుకున్న గొప్ప అవార్డు అని ప్రశంసించుకుంది. వివిధ రంగాల్లో ఆడవాళ్ల ప్రతిభను గుర్తించి వారికి పిలిచి మరీ అవార్డులు ఇవ్వడం అద్భుతమని, అందులోనూ తనను గుర్తు చేసుకుని అవార్డు ఇచ్చినందుకు సంతోషంగా ఉందని పేర్కొంది సుస్మితా.

దేశంలో పెరిగిపోతున్న అత్యాచారాల గురించి మాట్లాడడం మానేశానని చెప్పింది. 'ఎందుకంటే ఇలాంటి ఘటనలపై చర్చిస్తాం, ఆందోళన వ్యక్తం చేస్తాం. అంతకుమించి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోవు. ఇలాంటి ఘటనలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. కొత్తేమీ కాదు. ఈ విషయంలో మనకు రెండు ఆప్షన్లు ఉన్నాయి. అందులో ఒకటి ఇలాంటి ఘటనల గురించి తెలిసినప్పుడు బాధపడి మర్చిపోవడం. మరొకటి ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలవడం' అని చెప్పింది. నేరాలకు పాల్పడే పాల్పడేవారి గురించి కాకుండా దేశంలో మహిళలకు సాయం చేస్తూ, వారికి మద్దతుగా నిలిచే మగవారి గురించి ఎక్కువ దృష్టిసారించాలని సూచించింది.