అందుకే విడాకులు తీసుకున్నా!

అందుకే విడాకులు తీసుకున్నా!

 చెన్నై , పెరంబూరు: ఏడడుగులతో నూరేళ్ల బంధం ముడిపడాలని పెళ్లి చేసుకున్న భార్య భర్తలు ఆ బంధాన్ని మధ్యలోనే తుంచుకుని విడిపోవడానికి కారణాలు చాలానే ఉంటాయి. అయితే సినీరంగంలో ఇవి కాస్త ఎక్కువనే చెప్పాలి. నటి ప్రియాంక తన భర్త నుంచి విడాకులు పొందింది. ఈ ఘటన జరిగి మూడేళ్లు కావస్తోంది. అయితే ఆ విషయం ఇప్పుడే పబ్లిక్‌కు తెలిసింది. అందుకు కారణాన్ని నటి ప్రియాంక ఇటీవల బయట పెట్టడంతో బహిర్గతం అయ్యింది.

అసలేం జరిగిందంటే.. నటి ప్రియాంక మాతృభాష మలయాళం. ఈమె వసంతబాలన్‌ దర్శకత్వం వహించిన వెయిల్‌ చిత్రంలో ఒక హీరోయిన్‌గా నటించారు. తరువాత సెంగాత్తుభూమియిలే, వానం పార్తు సీమయిలే వంటి తమిళ చిత్రాలతో పాటు మలమాళం చిత్రాల్లోనూ నటించారు. ఆ సమయంలోనే దర్శకుడు లారెన్స్‌రావ్‌ ప్రేమలో పడ్డారు. చాలా కాలం ప్రేమించుకున్న ఈ జంట 2012లో పెళ్లితో ఒకటయ్యారు. వీరి సంసారం మూడేళ్లు సజావుగా సాగింది.

ముకుందరామ్‌ అనే కొడుకు పుట్టాడు. తరువాతనే ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరిగాయి. అయితే నటి ప్రియాంక గర్భిణిగా పుట్టింటికి వెళ్లి మళ్లీ మెట్టినింటికి రాలేదు. భర్త నుంచి విడాకులు పొందారు. ఈ విషయాలను ఈమె ఇటీవల ఒక మీడియాకిచ్చిన భేటీలో తెలిపారు. తాను నటించడం తన భర్తకు ఇష్టం లేదని, నటనకు స్వస్తి పలకాలని ఆంక్షలు విధించాడని చెప్పారు తనకు నటన కాకుండా మరేం తెలియదన్నారు. అయితే తాను తన భర్త లారెన్స్‌రావ్‌ నుంచి విడాకులు పొందడానికి మరో కారణం ఉందన్నారు. తమ ఆంతరంగిక ఫొటోలను తను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశాడని, అందుకే ఆయనతో కాపురం చేయడం ఇష్టం లేక విడాకులు పొందానని తెలిపారు. కాగా  కొడుకు ప్రియాంకతోనే ఉండడంతో అతడి కోసం లారెన్స్‌రావ్‌ ఇప్పుడు కోర్టును ఆశ్రయించారు.