బెయిల్ రాగానే పెళ్లి చేసుకున్నాడు..!

బెయిల్ రాగానే పెళ్లి చేసుకున్నాడు..!

 ముంబై: లైంగిక దాడి ఆరోపణల కేసులో బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్‌కు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. బెయిల్ రాగానే మహాక్షయ్ తన స్నేహితురాలు, టాలీవుడ్ నటి మదాలస శర్మను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి పెండ్లి ఇవాళ ఊటీలో అత్యంత సన్నిహితుల మధ్య జరిగినట్లు బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. ఊటీలో మిధున్ చక్రవర్తికి చెందిన లగ్జరీ హోటల్‌లో సాంప్రదాయ పద్దతిలో వీరి వివాహం జరిగినట్లు సమాచారం. తొలుత జూన్ 7న పెండ్లి ముహూర్తం ఖరారైనప్పటికీ ఈ కేసు కారణంగా రద్దయింది. 


మహాక్షయ్ తనపై లైంగిక దాడి చేయడంతోపాటు బలవంతంగా అబార్షన్ చేయించాడని హిందీ, భోజ్‌పురి సినిమాల్లో నటించిన ఓ నటి ఢిల్లీ కోర్టులో ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆమె ఆరోపించింది. నాలుగేళ్లుగా తనను పెళ్లి చేసుకుంటానంటూ తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని సదరు నటి వాపోయింది. తాను గర్భవతిని అయిన సమయంలో మహాక్షయ్ ఏవో మందులు ఇచ్చాడని, అవి వేసుకోగానే తనకు గర్భస్రావం అయినట్లు కూడా చెప్పింది. అంతేకాదు మ‌హాక్ష‌య్ త‌ల్లి యోగితా కూడా మహాక్షయ్‌తో సంబంధాన్ని కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ తనను బెదిరించిందని తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలో మహాక్ష‌య్ పై కేసు న‌మోదు చేశారు పోలీసులు. తాజాగా యాంటిసిపేటరీ బెయిల్ మంజూరైంది.