దర్శకుడు వికాస్‌  బహ్‌ల లైంగికంగా వేధించాడు

దర్శకుడు వికాస్‌  బహ్‌ల లైంగికంగా వేధించాడు

  బాలీవుడ్‌లో లైంగిక వేధింపులపై రోజుకో వార్త బయటకొస్తుంది. తనను పదేళ్ల క్రితం నటుడు నానా పటేకర్‌ లైంగికంగా వేధించాడని, తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని తనుశ్రీ దత్‌ ఆరోపించింది. ఈమెకు బాలీవుడ్‌లో చాలా మంది నుంచే మద్దతు లభించింది. ఈ తరుణంలో ఒక్కొక్కరు తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి బయటపెడుతున్నారు. తాజాగా కంగనా రనౌత్‌ కూడా వేధింపులకు గురైనట్టు వెల్లడించింది. 'క్వీన్‌' దర్శకుడు వికాస్‌ బహ్‌ల తన పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని పేర్కొంది కంగనా. అనురాగ్‌ కశ్యప్‌, మధు మెత్వాని, విక్రమాదిత్య మెత్వానితో కలసి వికాస్‌ బెహ్ల 'ఫాంటమ్‌ ఫిల్స్‌' అనే సంస్థను ఏర్పాటు చేశారు.

ఈ సంస్థకు సంబంధించి 2015 అక్టోబర్‌లో గోవాకు ట్రిప్‌ వెళ్లినప్పుడు వికాస్‌ బహ్‌ల తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, ఈ విషయం కశ్యప్‌కు చెప్పినా పట్టించుకోలేదని ఆ సంస్థకు చెందిన ఓ ఉద్యోగిని ఆరోపించింది. కశ్యప్‌ పట్టించుకోకపోవడం వేధింపులు పెరుగుతూనే ఉండడంతో ఆమె ఆ సంస్థ నుంచి బయటకొచ్చేసింది. ఆ సమయంలో వికాస్‌పై ఆరోపణలు చేసిందీ ఆ ఉద్యోగిని. అప్పుడు ఆమె చెప్పేవన్నీ నిజమేనని కంగనా పేర్కొంటూ తనకు మద్దతుగా నిలిచింది. కానీ ఆ తర్వాత అది మరుగున పడిపోయింది. తాజాగా తనుశ్రీ దత్‌ చేసిన ఆరోపణల నేపథ్యంలో వికాస్‌ బహ్‌లపై వచ్చిన ఆరోపణలను 'హుఫ్‌పోస్ట్‌ ఇండియా' అనే పత్రిక పునరుద్ఘాటిస్తూ మళ్లీ వ్యాసం ప్రచురించింది.

దీనిపై కంగనా స్పందిస్తూ..''క్వీన్‌ చిత్ర దర్శకుడిపై ఆమె చేసిన ఆరోపణలన్నీ నిజమే. వికాస్‌కు వివాహం(2014లోనే) జరిగినా కొత్తవ్యక్తులతో వివాహేతర సంబంధం కొనసాగించాలని అనుకుంటూ ఉండేవాడు. వివాహం గురించి నేను మాట్లాడలేను గానీ అలవాటు వ్యసనంగా మారేటప్పుడు మాత్రం కచ్చితంగా బయటకు వ్యక్తం చేయాల్సిందే'' అని చెప్పింది. తనకు ఎదురైన అనుభవం గురించి మాట్లాడుతూ 'ప్రతిసారీ మేము కలిసేటప్పుడు నున్ను వికాస్‌ చాలా గట్టిగా కౌగిలించుకునేవాడు. ముఖాన్ని తాకేందుకు ప్రయత్నించేవాడు. నా వెంట్రుకల వాసనను పీల్చేవాడు. ఆయన ఆలింగనం నుంచి విడిపించుకోవడానికి చాలా గట్టిగా ప్రయత్నించాల్సి వచ్చేది. 'ఇంత సువాస ఎలా వస్తుంది చాలా ప్రేమగా ఉంది' అనేవాడు. అప్పుడే నేను చెప్పేదాన్ని..ఏదో తప్పు జరుగుతోందని' అని వివరించింది కంగనా. 

ఫాంటమ్‌ ఉద్యోగిని గురించి వివరిస్తూ...'వికాస్‌పై ఆమె చేసిన ఆరోపణలన్నీ నిజమేనని నేను అప్పుడే చెప్పాను. అప్పట్లో ఆమె సాయం కావలని కోరింది కూడా. ఆ సమయంలో వాళ్లకు అనుకూలంగా పరిస్థితులను మార్చేసుకున్నారు. నేను ఆమెకు మద్దతుగా నిలిచాను కానీ దీన్ని ఒక ఉద్యమంగా తీసుకెళ్లలేకపోయా...అది నా తప్పే' అని చెప్పారు. వికాస్‌ మరోసారి హర్యానికి చెందిన మహిళా గోల్డ్‌మెడలిస్ట్‌ కథను తీసుకుని తన వద్దకు వచ్చాడని, కానీ తర్వాత తన వద్దకు రాలేదని చెప్పింది. ఆ సినిమా రూపొందలేదని, అటువంటి గొప్పకథను తాను ఒదులుకోదలుచుకోలేదని, కానీ ఆయన కూడా ఆ సినిమా గురించి తదుపరి ఏం మాట్లాడలేదని చెప్పింది.