నా బాడీ నా ఇష్టం.. మీకెందుకు?

నా బాడీ నా ఇష్టం.. మీకెందుకు?

 లండన్‌: తన ఫొటోలను కొందరు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై బ్రిటన్‌కు చెందిన టీవీ యాంకర్ స్టేసీ సోలోమన్(28) తీవ్రంగా స్పందించారు. తన బికినీ ఫొటోలను మార్ఫింగ్ ఎందుకు చేశారంటూ సోషల్ మీడియా వేదికగా ఆమె ప్రశ్నించారు. అసలు వివాదం ఏంటంటే.. ఇటీవల ఓ మ్యాగజీన్ కవర్ పేజీ కోసం స్టేసీ సోలోమన్ బికినీ ధరించి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ ఫొటోలు మ్యాగజీన్‌పై దర్శనమిచ్చాయి. కొన్ని రోజుల తర్వాత తన ఫొటోలను కొందరు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు ఆమె గుర్తించారు. నా ఫొటోలు ఎడిటింగ్‌, మార్ఫింగ్ చేసి పోస్ట్‌ చేసే హక్కు మీకు ఎవరిచ్చారంటూ గళమెత్తారు.

తాను దిగిన ఫొటోతో పాటు ఫొటోషాప్ చేసిన ఫొటోలను జతచేసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పలు పోస్టులు చేశారు. ఆమెకు నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది. ఎంతో సహజంగా కనిపిస్తున్న తన అందాన్ని ఫొటోషాప్‌తో సహజత్వం కోల్పోయేలా చేశారన్నారు. బొద్దుగా ఉన్న మడతలను, లావుగా ఉన్న నడుము కొలతను కొందరు ఉద్దేశపూర్వకంగానే ఎడిట్ చేశారని వెల్లడించారు. ఇలాంటి ఎడిటింగ్‌ ఫొటోలు పోస్ట్ చేయడం.. నన్ను సన్నగా, మీకు ఇష్టం వచ్చినట్లుగా శరీరాకృతిని కాపాడుకోవాలని సూచించడంతో పాటు అవహేళన చేయడమేనని స్టేసీ సోలోమన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరెన్ని చేసినా తాను తనలాగే ఉండాలనుకుంటున్నట్లు చేసిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.