ప్రతి అవకాశంలోనూ సంతోషం కోసమే అన్వేషణ - సోనాలి బింద్రే

ప్రతి అవకాశంలోనూ సంతోషం కోసమే అన్వేషణ - సోనాలి బింద్రే

 బాలీవుడ్‌ నటి సోనాలి బింద్రే హైగ్రేడ్‌ క్యానర్‌తో బాధపడుతున్న నేపథ్యంలో న్యూయార్క్‌లో కీమో థెరఫీ చేయించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిందే. ఈమె ఆరోగ్యంపై సామాజిక మాధ్యమాల్లో సోనాలి కానీ, ఆమె భర్త కానీ నిత్యం అబ్‌డేట్‌ ఇస్తూనే ఉన్నారు. చికిత్స నిమిత్తం న్యూయార్క్‌ వెళ్లినప్పుడు తన జుట్టును కాస్త తగ్గించుకున్నారు. ఇప్పుడు పూర్తి గుండు చేయించుకున్నారు. ఈ విధంగా గుండు చేయించుకుని తన స్నేహితులు సుసాన్నే ఖాన్‌, గాయత్రి ఒబెరారుతో దిగిన ఫొటోను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేశారు. 

ఈ సందర్భంగా తనకు తాను మనోధైర్యాన్ని చెప్పుకుంటూ, తనకు అండగా నిలుస్తున్న స్నేహితులను గుర్తు చేసుకుంటూ ఓ లేఖను కూడా పోస్టు చేశారు. ''ఈ ఫొటోలో గుండుతో ఉన్నది నేనే. ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాను. ఇప్పుడు ఇలా చెబుతున్నందుకు నన్ను కొందరు వింతగా చూస్తారు. ఆ విషయం నాకూ తెలుసు. కానీ ఇది నిజం. ఎందుకంటే..ఇప్పుడు ప్రతి నిమిషం నాకు చాలా విలువైంది. సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి ప్రతి అవకాశంలోనూ సంతోషం కోసం అన్వేషిస్తున్నా. అయితే కొంత ఇబ్బందులు కూడా ఉన్నాయి. కానీ నాకు ఏదీ నచ్చితే అదే చేస్తున్నా. నాకు నచ్చిన వాళ్లతో ఆనందంగా గడుపుతున్నా.

నాకు చాలా గొప్ప స్నేహితులున్నారు. వాళ్లే నా బలం. ఈ సంఘటన తెలిసిన దగ్గర నుంచీ నా దగ్గరకొచ్చి నాతోనే గడుపుతున్నారు. వారికి చాలా బిజీ షెడ్యూల్స్‌ ఉన్నా చూడ్డానికి వస్తున్నారు. ఫోన్‌ చేస్తున్నారు. మెసేజ్‌లు పెడుతున్నారు. నేను ఒంటిరిని అనే భావన కలగకుండా చూసుకుంటున్నారు. వీళ్లదే నిజమైన స్నేహమంటే. అందుకు వీళ్లకు ధన్యవాదాలు తెలపాలి. ఈ మధ్యకాలంలో నేను తయ్యారవడానికి తక్కువ సమయం పడుతోంది. ఎందుకంటే ఇప్పుడు జడ వేసుకునే అవకాశం లేదు అని పేర్కొంటూ కన్ను కొడుతూ నాలుక బయటపెట్టిన ఎమోజీ పోస్టు చేశారు. ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఫొటోను హృతిక్‌ రోషన్‌ తీసినట్టు ఆ పోస్టులో పేర్కొన్నారు.