టికెట్‌ ఇచ్చేందుకు ఆసక్తి చూపుతోన్న కాంగ్రెస్‌

టికెట్‌ ఇచ్చేందుకు ఆసక్తి చూపుతోన్న కాంగ్రెస్‌

  ముంబై : మూడు రాష్ట్రాల ఎన్నికల విజయంతో ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ.. మధ్యప్రదేశ్‌లోనూ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు గెలుపు వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భోపాల్‌ టికెట్‌ను ప్రముఖ బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌కు ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. వివరాలు.. కాంగ్రెస్‌ నాయకులు గుడ్డు చౌహాన్‌, ఆనీస్‌ ఖాన్‌ ఈ విషయం గురించి పార్టీ అధిష్టానంతో చర్చించినట్లు తెలుస్తోంది. భోపాల్‌లో బీజేపీని ఓడించాలంటే బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని..  దానిలో భాగంగా ఇక్కడ నుంచి కరీనాను పోటీ చేయిస్తే బాగుంటుందని భావిస్తున్నట్లు తెలిసింది.

ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ మాత్రమే కాక మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ కొడలు వంటి అంశాలు కరీనా గెలిచేందుకు సహకరిస్తాయని గుడ్డు చౌహన్‌ విశ్వసిస్తున్నారు. సైఫ్‌ అలీ ఖాన్‌ తాత ఒకప్పుడు భోపాల్‌ నవాబ్‌గా ఉన్నారు. దాంతో ఈ లోక్‌సభ ఎన్నికల్లో కరీనా.. కాంగ్రెస్‌ తరఫున భోపాల్‌ నుంచి పోటీ చేస్తే తప్పక గెలుస్తుందని గుడ్డు చౌహాన్‌ అధిష్టానానికి తెలిపినట్లు సమాచారం. అయితే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన వెలువడక ముందే బీజేపీ నాయకులు విమర్శించడం ప్రారంభించారు. బీజేపీని ఎదుర్కోగల బలమైన అభ్యర్థి కాంగ్రెస్‌లో ఎవరూ లేరు. అందుకే సినితారలను నిలబెట్టాలని భావిస్తోంది. స్థానిక నాయకులు ఎవరూ ఆ పార్టీకి కనిపించడం లేదంటూ బీజేపీ విమర్శిస్తోంది.