‘అప్పుడు అవకాశాల్ని తిరస్కరించాను’

‘అప్పుడు అవకాశాల్ని తిరస్కరించాను’

 తెలుగులో నేను నటిస్తున్న తొలి చిత్రం ఉంగరాల రాంబాబు. జాతకాల పిచ్చి వున్న ఓ యువకుడి కథ నేపథ్యంలో సినిమా సాగుతుంది. అతని ఆఫీస్‌లో పనిచేసే సావిత్రిగా కనిపిస్తాను. తొలి సగభాగంలో మోడ్రన్ యువతిగా, సెకండ్ హాఫ్‌లో సంప్రదాయ బద్దమైన యువతిగా...ఇలా నా పాత్ర భిన్న పార్శాల్లో సాగుతుంది అన్నారు మియాజార్జ్. ఆమె నటిస్తున్న తాజా చిత్రం ఉంగరాల రాంబాబు. సునీల్ కథానాయకుడిగా నటించారు. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో పరుచూరి కిరీటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మియాజార్జ్ మాట్లాడుతూ గతంలో తెలుగు చిత్రాల్లో నటించమని చాలా ఆఫర్‌లు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. అయితే తెలుగు భాషపై నాకు అంతగా పట్టులేకపోవడంతో వచ్చిన అవకాశాల్ని సున్నితంగా తిరస్కరించాను. మలయాళ, తమిళ భాషల్లో ఇప్పటి వరకు దాదాపుగా 25కి పైగా చిత్రాల్లో నటించాను. అయితే క్రాంతిమాధవ్ చెప్పిన కథ నన్నెంతగానో ఆకట్టుకోవడంతో తొలిసారి తెలుగులో నటించాను. 

జాతకాలపిచ్చి వున్న ఉంగరాల రాంబాబుతో ప్రేమలోపడతాను. అభ్యుదయ భావాలున్న తన మామను ఉంగరాల రాంబాబు ఎలా ఒప్పించాడు? తను ప్రేమించిన సావిత్రిని ఎలా సొంతం చేసుకున్నాడు? అనేది ఆసక్తిని పంచుతుంది. ఇదొక ఫ్యామిలీ సెంటిమెంట్‌తో సాగే ఎమోషనల్ ఎంటర్‌టైనర్. ఇందులో నాకు తండ్రిగా ప్రకాష్‌రాజ్ నటించారు. సినిమాలో ఆయన కమ్యూనిస్టుగా కనిపిస్తారు. సమానత్వం వుండాలని ప్రశ్నిస్తూనే రైతు సమస్యలపై పోరాడే పాత్ర ఆయనది. ప్రకాష్‌రాజ్‌గారి పాత్ర చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. నాకు తెలుగు రాకపోవడంతో చాలా వరకు డైలాగ్స్‌ని బట్టీ పట్టి చేశాను. సునీల్ తెరపైన ఎలా నవ్విస్తూ వుంటారో తెర వెనుక కూడా అంతే హ్యూమర్‌గా అందరిని నవ్విస్తూ వుంటారు.

రెగ్యులర్ కథానాయికగా పాటలకే పరిమితమయ్యే పాత్రలు చేయడం నాకు ఇష్టం వుండదు. కథలో నా పాత్రకు ప్రాముఖ్యత వుండాలి. నటనకు ఆస్కారమున్న పాత్రలకే ప్రాధాన్యత. అలా అని నా పాత్ర చుట్టే కథ మొత్తం తిరగాలని చెప్పడం లేదు. ఏదో ఒక ప్రత్యేకత వున్న పాత్రలే చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా నటిస్తున్న చిత్రంలో ఆయన కూతురి పాత్ర చేస్తున్నాను. తెలుగులో కొన్ని చిత్రాలు చర్చల దశలో వున్నాయి.