బీచ్‌లో చీర కట్టుకొని తిరగాలా?

బీచ్‌లో చీర కట్టుకొని తిరగాలా?

 న్యూఢిల్లీ : బాలీవుడ్‌ నటి రాధికా ఆప్తే తెలుగువారికీ సుపరిచితురాలే. బాలకృష్ణతో లెజెండ్‌, లయన్‌.. వర్మ రక్తచరిత్ర వంటి సినిమాలతోపాటు రజనీకాంత్‌ హీరోగా నటించిన ‘కబాలి’సినిమాతో ఆమె దక్షిణాదివారికి చేరువైంది. బాలీవుడ్‌లోనూ మంచి నటిగా పేరొందిన రాధికా ఆప్తే ఇటీవల అక్షయ్‌కుమార్‌ సరసన ‘ప్యాడ్‌మ్యాన్‌’ సినిమాలో అలరించింది.ఇటీవల ఈ భామ తన స్నేహితుడితో కలిసి బీచ్‌లో సేదదీరుతున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. బికినీ ధరించి గోవా బీచ్‌లో దిగిన ఈ ఫొటో పెట్టగానే.. ఆమెను కించపరుస్తూ పలువురు కామెంట్లు చేశారు. బాడీషేమింగ్‌ చేస్తూ ఎద్దేవా చేశారు.

ఈ విషయమై మీడియా ప్రస్తావించగా.. ‘నన్ను ట్రోల్‌ (కించపరుస్తూ) చేసేవారి కామెంట్లు పెద్దగా పట్టించుకోను. ఎవరైనా ఆ విషయం చెప్తే తప్ప నాకు వాటి గురించి తెలియదు. అయినా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మూర్ఖత్వం. బీచ్‌లో నేను చీర కట్టుకొని తిరగాలని వారు భావిస్తున్నారా?’ అని ఆమె ప్రశ్నించారు. ట్రోలర్స్‌ను ఎలా ఎదుర్కొంటారని ప్రశ్నించగా.. నాకు వాళ్లు ఎవరో తెలియదు.. వాళ్ల గురించి అసలే పట్టించుకోను అని ఆమె తాపీగా సమాధానం ఇచ్చారు.సోషల్‌ మీడియాలో హీరోయిన్లను కించపరుస్తూ ట్రోలర్స్‌ చెలరేగిపోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో బాలీవుడ్‌ నటీమణులు ప్రియాంకచోప్రా, తాప్సీ పన్ను, ఈషా గుప్తా, దీపికా పదుకోన్‌, పరిణీత చోప్రా తదితరుల ఫొటోలపై కూడా కొందరు కించపరిచేరీతిలో అసభ్య కామెంట్లు పెట్టారు. ఇలా ట్రోల్‌ చేసేవారికి కొందరు ఘాటు రిప్లే ఇవ్వగా.. మరికొందరు సెలబ్రిటీలు లైట్‌ తీసుకున్నారు.