దీపికాకు ‘గ్లోబల్‌ బ్యూటీ స్టార్‌’ అవార్డు

దీపికాకు ‘గ్లోబల్‌ బ్యూటీ స్టార్‌’ అవార్డు

 దీపికా పదుకొనే ఈ ఏడాది చేసిన 'పద్మావత్‌'తో 300కోట్ల క్లబ్‌లో చేరిన మొదటి కథానాయిక. ఓ మహిళా టైటిల్‌ రోల్‌ పోషిస్తూ...ఆ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద 300కోట్లు కలెక్ట్‌ చేసిన చిత్రం కూడా 'పద్మావత్‌' కావడం విశేషం. ఈ సినిమాలో రాణి పద్మావతిగా ఆమె నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. సినీ విమర్శకులు కూడా తెగ ప్రశంసించారు. బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న తారల్లో కూడా దీపికా ఉంది. ఈ ఏడాది టైమ్‌ విడుదల చేసిన ప్రభావంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలో దీపికా కూడా నిలిచింది. తాజాగా ఈమెకు గ్లోబల్‌ బ్యూటీ స్టార్‌ పురస్కారం వరించింది. 'ఎల్లే బ్యూటీ అవార్డ్స్‌ 2018'ని ఆదివారం అందించారు. మెటలిక్‌ గౌడ్‌ ధరించి ఈ వేడుకలో దీపికా క్యాట్‌వాక్‌ చేసి హోయలొలికించింది. ప్రపంచస్థాయిలో ఈమెకు అవకాశాలు పెరుగుతున్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు కూడా. ప్రస్తుతం ఈమె నిర్మాతగా మారింది. దర్శకురాలు మేఘన గుల్జార్‌తో కలసి ఓ ప్రొడక్షన్‌ హౌస్‌ను ప్రారంభించబోతున్నారు. యాసిడ్‌ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవిత కథను ఈ బ్యానర్‌లో తొలి చిత్రంగా తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొనే లక్ష్మీ పాత్రను పోషించనుంది.