దీపికాపదుకునే పెళ్లికి ముహూర్తం?

దీపికాపదుకునే పెళ్లికి ముహూర్తం?

 రణవీర్‌సింగ్, దీపికాపదుకునే ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే. రామ్‌లీలా చిత్రం నుంచి మొదలైన ఈ జంట ప్రణయగాథ నిరాటంకంగా కొనసాగుతున్నది. రణవీర్ పక్కనుంటే నేను ప్రపంచాన్నే మరచిపోతాను. అతడొక అద్భుతం అని దీపికాపదుకునే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. గతంలో తన ప్రేమ వ్యవహారం గురించి మాట్లాడటానికి ఏమాత్రం ఇష్టపడని దీపికా ఒక్కసారిగా తన మనసులోని భావాల్ని వ్యక్తం చేయడంతో వీరిద్దరి ప్రేమకథ కొత్త మలుపు తీసుకోబోతుందనే గుసగుసలు వినిపించాయి. అందరూ అనుకుంటున్నట్లుగానే ప్రేమజంట ఈ ఏడాది పెళ్లిపీటలెక్కబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ కథనాల ప్రకారం ఈ ప్రేమికులిద్దరూ మరో మూడు నెలల్లో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. 

ఇటీవలే దీపికాపదుకునే తల్లిదండ్రులు బెంగళూరు నంచి ముంబయికి వచ్చి రణవీర్‌సింగ్ కుటుంబ సభ్యులతో పెళ్లి గురించి చర్చలు జరిపారట. పెళ్లి ఎక్కడ చేయాలనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయట. అయితే రణవీర్, దీపికా మిత్ర బృందమంతా ముంబయిలోనే వుండటంతో అక్కడే వివాహం జరుపుదామనే నిర్ణయానికొచ్చారని తెలిసింది. తొలుత విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు సన్నాహాలు చేసుకున్నారని, అయితే ఆ ప్రయత్నానికి దీపికాపదుకునే తల్లిదండ్రులు సమ్మతించలేదని చెబుతున్నారు. దక్షిణ భారతీయ సంప్రదాయ పద్దతుల్లో వివాహం జరపడానికి రణవీర్‌సింగ్ కుటుంబ సభ్యులు అంగీకరించారని సమాచారం. ఇప్పటికే పెళ్లి తాలూకు ఏర్పాట్లలో దీపికా, రణవీర్ బిజీగా వున్నారని, జూన్‌లో ఈ జంట వివాహబంధంతో ఒక్కటవ్వడం ఖాయమని వారి సన్నిహితులు అంటున్నారు.