గులేబకావళి...నిధి రహస్యం...

గులేబకావళి...నిధి రహస్యం...

 ప్రభుదేవా, హన్సిక జంటగా నటించిన తమిళ చిత్రం గులేబకావళి. కల్యాణ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని అదే పేరుతో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మల్కాపురం శివకుమార్ తెలుగులోకి అనువదిస్తున్నారు. సీనియర్ నటి రేవతి శక్తివంతమైన పాత్రలో నటించారు. ఏప్రిల్ 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానున్నది. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాల్ని తెలియజేస్తూ గులేబకావళి అనే గ్రామంలో నిక్షిప్తమైన కోట్లాది రూపాయల విలువైన నిధి కోసం జరిగే అన్వేషణ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. ఆద్యంతం వినోదభరితంగా సాగుతూనే ఉత్కంఠను పంచుతుంది.


కథలోని మలుపులు థ్రిల్‌కి గురిచేస్తాయి. నిధిని సొంతం చేసుకునే ప్రయత్నంలో చోటుచేసుకునే సంఘటనలు అనూహ్యంగా సాగుతాయి. ప్రభుదేవా నృత్యాలు, నటన హైలైట్‌గా నిలుస్తాయి. ఆయన పాత్ర చిత్రణ నవ్యమైన పంథాలో ఉంటుంది. ఇటీవల విడుదలైన పాటలకు, ప్రచార చిత్రానికి చక్కటి స్పందన లభిస్తున్నది. తమిళంలో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే నమ్మకముంది అని తెలిపారు. మన్సూర్ అలీఖాన్, మధు, ఆనంద్‌రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్టంట్స్: పీటర్ హెయిన్స్, సంగీతం: వివేక్ మెర్విన్, కెమెరా: ఆర్‌ఎస్ ఆనంద్‌కుమార్, ఆర్ట్: కదీర్, పాటలు: సామ్రాట్, దర్శకత్వం: కల్యాణ్, నిర్మాత: మల్కాపురం శివకుమార్.