గుర్రానికి రెండు కోట్లు

గుర్రానికి రెండు కోట్లు

 బాలీవుడ్‌లో సల్మాన్‌ ఖాన్‌, తెలుగు చిత్రసీమలో రామ్‌ చరణ్‌కు గుర్రాలు పెంచడమంటే చాలా ఇష్టం. వీరిద్దరూ గుర్రాల కోసం ప్రత్యేక శాలలనే నిర్మించి పెంచుతున్నారు. కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ కొత్త గుర్రాన్ని కొనాలనుకున్నాడట. దానికి రెండు కోట్లు ఇస్తానని చెప్పాడట. అయినా ఆ గుర్రం యజమాని దాన్ని ఇవ్వడానికి ఇష్టపడలేదు. సల్మాన్‌ అడిగినా ఇవ్వలేనన్ని ప్రత్యేకతలు ఆ గుర్రంలో ఏమున్నాయి? అసలు గుర్రం ఎవరిది? అని పరిశీలిస్తే...సిరాజ్‌ పాతన్‌ అనే వ్యక్తి ఐదేళ్ల క్రితం ఈ గుర్రాన్ని రాజస్థాన్‌లో ఓ సంతలో 14.5 లక్షలకు కొనుగోలు చేశాడు. 

ఈ గుర్రానికి అంతకు ముందు తుఫాన్‌, పవన్‌ అనే పేర్లు ఉండేవి. సిరాజ్‌ కొన్నాక దానికి సఖిబ్‌ అనే పేరు మార్చేశాడు. ఇది గంటకు 43 కిలోమీటర్లు వేగంతో పరుగెత్తగలదు. ఇప్పటి వరకూ ఒక్క రేస్‌లోనూ పాల్గొలేదు. ఈ గుర్రానికి తల్లి పాకిస్తాన్‌లోనూ, తండ్రి రాజస్థాన్‌లో ఉన్నాయి. ఇటువంటి గుర్రాలు అమెరికా, కెనడాల్లో మాత్రమే ఉంటాయి. అందుకే ఇంత డిమాండ్‌. ఈ గుర్రానికి సల్మాన్‌కు ముందు పంజాబ్‌ ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన బాదల్‌ ఫ్యామిలీ 1.11 కోట్లు ఇస్తానని చెప్పినా ఇవ్వలేదట. ఇప్పుడు సల్మాన్‌ రెండు కోట్లు ఇస్తానన్నా ఇవ్వలేదు.