మూడున్నరేళ్లు ఇబ్బందులు పడ్డా

మూడున్నరేళ్లు ఇబ్బందులు పడ్డా

 బాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌ హీరోగా రాణిస్తున్న వారిలో రణవీర్‌ సింగ్‌ ఒకరు. ట్రెండ్‌కు తగ్గట్టు ఫాలో అవడంలో అతనికి మించిన వారు లేరు. తాజా దీపికా పదుకొనేను వివాహం చేసుకున్న తర్వాత సినిమాలు చేయడం మరింత పెంచాడు. స్టార్‌ కావడానికి ముందు ఈయన కూడా ఇబ్బందులు పడ్డాడట. ఆ విషయాన్ని రణవీర్‌ తాజాగా వెల్లడించాడు. ఆయన చిత్రం 'సింబా' విడుదలైన సందర్భంగా మాట్లాడారు. ''నేను ఎదుర్కొన్న పరిస్థితులే నన్ను ఇలా తయారు చేశాయి. 

నాకు నేనుగా ఇలా ఉండాలి. అలా ఉండాలని అని అనుకోలేదు. సుమారుగా మూడున్నరేళ్ల పాటు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఈ రోజు నాకు అవకాశాలు వస్తున్నాయి. నాకు ఛాన్స్‌లు ఇస్తున్నవారిని నేను ఎప్పుడూ గౌరవిస్తా. నేను ఎప్పుడూ ఆ విషయాన్ని మరిచిపోను. మిడిల్‌ పాత్‌ను అడాప్ట్‌ చేసుకోవడానికి ప్రయత్నిస్తా. విజయాలు వస్తే సంబరిపడిపోను. వైఫల్యాలు వస్తే నిరాశ పడను. విజయం వస్తే ఆనందిస్తా. అలా చేయాల్సిందే. సినిమా అనేది అనేకమంది కష్టం. అది వైఫల్యం చెందిందంటే ఒక్కరి వల్ల కాదు. అదొక ఉమ్మడి వైఫల్యం'' అని చెప్పారు. 

రణవీర్‌ సింగ్‌ తన తోటి నటి అలియా భట్‌ను తెగ పొగిడేస్తున్నాడు. వీరిద్దరూ కలసి ప్రస్తుతం 'గల్లీ బారు' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో రణవీర్‌ మాట్లాడుతూ ''ఈ సినిమాకు పనిచేయకముందు అలియాతో కలసి కొన్ని ప్రకటనలు చేశాను. చాలా ఫన్‌గా అనిపించింది. ఆమె చాలా ఎనర్జీటిక్‌గా ఉంటుంది. కానీ 'గల్లీబారు' కోసం మేమిద్దరం కలిసి పని చేసినప్పుడు ఆమెలో అద్భుతమైన నటనా శక్తి ఉందని అర్ధమైంది. విపరీతమైన ప్రతిభ, నటన, పూర్తి స్థాయి భావోద్వేగం, చాలా తెలివైంది కూడా. నటనలోనూ, తెలివితేటల్లోనూ ఆమె చాలా ఉన్నతంగా ఉంది'' అని చెప్పారు రణవీర్‌.