స్పెషల్‌ సాంగ్‌లో సాయేషా సైగల్‌..!

స్పెషల్‌ సాంగ్‌లో సాయేషా సైగల్‌..!

  నటి సాయేషా సైగల్‌ కూడా ఐటమ్‌ సాంగ్‌కు సై అనేసింది. తెలుగులో అఖిల్‌ చిత్రంతోనూ, తమిళంలో వనమగన్‌ చిత్రంతోనూ కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్‌ బ్యూటీ సాయేషా సైగల్‌. తెలుగులో ఒక్క చిత్రంతోనే పక్కన పెట్టేసినా, కోలీవుడ్‌ మాత్రం మంచి అవకాశాలనే కల్పించింది. ఇక్కడ తొలి చిత్రం వనమగన్‌తోనే మంచి డాన్సర్‌ అని ప్రశంసలు పొందిన సాయేషా ఆ తరువాత కార్తీ, ఆర్య వంటి స్టార్స్‌తో జత కట్టింది.

తాజాగా సూర్యకు జంటగా కాప్పాన్‌ చిత్రంలో నటిస్తోంది. అయితే ఆ చిత్రం మినహా చేతిలో మరో అవకాశం లేదు. దీంతో కాప్పాన్‌పై చాలా ఆశలు పెట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐటమ్‌ సాంగ్‌కు సై అనేసింది. జీవీ.ప్రకాశ్‌కుమార్, కామెడీ నటుడు యోగిబాబులతో కలిసి సిందేసింది. జీవీ.ప్రకాశ్‌కమార్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో వాచ్‌మన్‌ ఒకటి. విజయ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జీవీకి జంటగా సంయుక్తా హెగ్డే నటిస్తోంది.జీవీనే సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో ర్యాప్‌ టైప్‌లో సాగే ఐటమ్‌ సాంగ్‌ చోటు చేసుకుంటుంది. ఈ పాటలో జీవీ.ప్రకాశ్, యోగిబాబులతో కలిసి సాయేషాసైగల్‌ నటించింది. ఈ పాటను ప్రచార చిత్రం కోసం చిత్రీకరించినట్లు దర్శకుడు విజయ్‌ తెలిపారు. ఇప్పుడీ పాట సామాజిక మాధ్యమాల్లో ఫుల్‌గా వైరల్‌ అవుతోంది.