విశ్రాంతి అవసరమని చెప్పినా..ప్రమోషన్స్‌లో అనుష్క

విశ్రాంతి అవసరమని చెప్పినా..ప్రమోషన్స్‌లో అనుష్క

 ముంబై: బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, వరుణ్‌ధావన్ కాంబినేషన్‌లో సూయీ దాగా చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు అనుష్క, వరుణ్. అనుష్క తనను వెన్నెముక సమస్య (బగ్లింగ్ డిస్క్) ఇబ్బంది పెడుతున్నా లెక్కచేయకుండా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నది. నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండటంతో అనుష్కకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. అయితే ఇవేవి పట్టించుకోకుండా విశ్రాంతి తీసుకోకుండా తన సినిమాను ప్రమోట్ చేసుకుంటుంది. అనుష్క వైద్యుల సూచన మేరకు ఫిజియోథెరపీ తరగతులకు హాజరవుతుంది. సూయీ దాగా చిత్రం సెప్టెంబర్ 28న విడుదల కానుంది. ఈ సినిమాతోపాటు షారుక్‌తో జీరో చిత్రంలోనూ నటిస్తోంది అనుష్క. వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిపరమైన ఒత్తిడిని అధిగమిస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీబీజీగా ఉంది అనుష్క.

కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా తొలి పోస్టర్‌ను విడుదల చేశారు. వరుణ్ ధావన్‌తో అనుష్క నటిస్తున్న తొలి చిత్రం ఇదే. ఈ సినిమాలోని పాత్ర‌ల‌కు అనుగుణంగా మారేందుకు వీరిద్ద‌రూ చాలా క‌ష్ట‌ప‌డ్డార‌ని బాలీవుడ్ వ‌ర్గాల చెబుతున్నాయి. ఈ చిత్రం కోసం వరుణ్ ధావన్ మిషన్ కుట్టడం నేర్చుకుంటే, అనుష్క శర్మ ఎంబ్రాయిడరీ నేర్చుకుంది. చిత్రానికి సంబంధించి విడుద‌లైన ఫోటోల‌లో అనుష్క‌ డీ గ్లామ‌ర్ లుక్ లో చాలా అందంగా క‌నిపించింది. మధ్యప్రదేశ్‌లోని ఛాందేరి, ఢిల్లీ, ముంబయిలోని పలు ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. చిత్రీకరణలో భాగంగా తీసిన ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.