లక్షల తాబేళ్లు మృతి!

లక్షల తాబేళ్లు మృతి!

 భువనేశ్వర్: కొన్ని లక్షల అరుదైన ఆలివ్ రిడ్లీ జాతి తాబేలు పిల్లలు మృత్యువాత పడ్డాయి. ఒడిశాలోని గహిర్మాత బీచ్ ఒడ్డున ప్రతి ఏటా లక్షల సంఖ్యలో ఆలివ్ రిడ్లీ తాబేళ్లు ఊపిరి పోసుకుంటాయి. కొన్ని వేల మైళ్లు ప్రయాణించే తల్లి తాబేళ్లు.. ఇక్కడి బీచ్‌లోనే గుడ్లు పెట్టి వెళ్లిపోతాయి. అవి పొదిగి పిల్ల తాబేళ్లు బయటకు వస్తాయి. అయితే ఈసారి అకాల వర్షాల కారణంగా బీచ్‌లో ఇసుక మొత్తం గట్టిగా మారింది. దీంతో గుడ్లలో నుంచి బయటకు వచ్చిన పిల్ల తాబేళ్లు ఆ ఇసుక నుంచి బయటకు రాలేక చనిపోయాయి.ఈ సారి కోటి వరకు తాబేలు పిల్లలు వస్తాయని అధికారులు అంచనా వేశారు. అయితే వర్షాల కారణంగా కొన్ని లక్షల తాబేళ్లు మృత్యువాత పడినట్లు చెప్పారు. ఈ ఆలివ్ రిడ్లీ తాబేళ్లు చాలా అరదైన జాతిగా మారిపోతున్నది. వేల తాబేళ్లలో ఒకటో రెండో మాత్రమే పెరిగి పెద్దవవుతున్నాయి.

ఈసారి లక్షల సంఖ్యలో ఒకేసారి చనిపోవడం మరింత ఆందోళన కలిగించే విషయం. బీచ్‌లో తల్లి తాబేళ్లు గుడ్లు పెట్టి వెళ్లిన గుంతలను తవ్వి చూడగా చనిపోయిన పిల్ల తాబేళ్లు కనిపించాయి. ఇసుక గట్టిపడడంతో అవి బయటకు రాలేకపోయాయని డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ బిమల్ ప్రసన్న ఆచార్య వెల్లడించారు.6.67 లక్షల తాబేలు పిల్లలు మాత్రం బతికి బయటపడ్డాయి. తల్లి తాబేళ్లు ఈసారి కనీసం రెండు కోట్ల గుడ్లు పెట్టి వెళ్లినట్లు గుర్తించారు. అందులో 27 లక్షల పిల్లలు బయటకు వచ్చాయి. వాటిలో చాలా వరకు ఈ వర్షాల వల్ల మృత్యువాత పడ్డాయి. ఒక్కో ఆలివ్ రిడ్లీ తాబేలు వంద నుంచి రెండు వందల గుడ్లు పెడుతుంది. ఇవి పొదగడానికి 45 నుంచి 50 రోజులు పడుతుంది. ప్రకృతి ప్రకోపం ఇప్పుడు గహిర్మాత బీచ్‌ను శ్మశానంగా మార్చేసిందని బిమల్ ప్రసన్న ఆవేదన వ్యక్తంచేశారు.