నిరసనల మధ్య సినీ అవార్డులు

నిరసనల మధ్య సినీ అవార్డులు

 న్యూఢిల్లీ : వివాదాలు, నిరసనల మధ్య 65వ జాతీయ సినిమా అవార్డులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రదానం చేశారు. ఇకపై జరిగే అవార్డుల ప్రదానోత్సవం, యూనివర్సిటీల స్నాతకోత్సవాలకు రాష్ట్రపతి కేవలం గంటసేపు మాత్రమే హాజరవుతారని రాష్ట్రపతి కార్యాలయం గురువారం ప్రకటన విడుదల చేయడమే వివాదానికి కారణంగా మారింది. సినీ అవార్డులను రాష్ట్రపతి కేవలం 11 మందికి మాత్రమే అందజేస్తారని అధికారులు పేర్కొనడంపై కళాకారులు నిరసన వ్యక్తం చేశారు. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి తాము హాజరుకామంటూ దాదాపు 70 మంది అవార్డు గ్రహీతలు సంతకాలతో కూడిన బహిరంగ లేఖను విడుదల చేశారు.

రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనప్పుడు ఇక కార్యక్రమానికి హాజరై ఏం ప్రయోజనమని వారు తెలిపారు. అవార్డుల ప్రదానం సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ సమాజంలో విభిన్న అంశాలను ఐక్యం చేసే వాటిల్లో సినిమా కూడా ఒకటి. అంతేకాదు.. ఐక్యతను పాటించడంలోనూ సినిమా పరిశ్రమ ముందుంటుంది. ఐక్యమత్యమే మన బలం అని చెప్పారు. అవార్డులు తీసుకోబోమని పలువురు అవార్డు గ్రహీతలు నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.