అత్తాఅల్లుళ్ల సవాల్

అత్తాఅల్లుళ్ల సవాల్

  అత్తకు కాస్త పొగరెక్కువ. తను చెప్పిందే వేదం అనుకునే తత్వం. కూతురంటే పంచప్రాణాలు. అయితే అల్లుడిని మాత్రం ఎప్పుడూ తన కంట్రోల్‌లో ఉంచుకోవాలని ప్రయత్నిస్తుంటుంది. తన మాటను కాదంటే సహించదు. మరోవైపు అల్లుడికి హుషారెక్కువ. అత్త అహంకారాన్ని ఎప్పుడూ ప్రశ్నిస్తుంటాడు. ఈ అత్తాఅల్లుడి మధ్య పోరు ఎందుకన్నదే శైలజా రెడ్డి అల్లుడులోని ఆసక్తికరమైన అంశం అన్నారు మారుతి. ఆయన దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం శైలజారెడ్డి అల్లుడు. అను ఇమ్మాన్యుయెల్ కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను సోమవారం విడుదల చేశారు.

తన కూతురితో కలిసి వున్న అల్లుడివైపు శైలజారెడ్డి (రమ్యకృష్ణ) కోపంగా చూస్తున్న ఫొటో అందరిని ఆకట్టకుంటున్నది. ఈచిత్రంలో నాగచైతన్య అత్త శైలజారెడ్డి పాత్రలో సీనియర్ నటి రమ్యకృష్ణ నటిస్తున్నది. నాగార్జున నటించిన అల్లరి అల్లుడు చిత్రంలోని నిన్ను రోడ్డుమీద చూసినాది లగాయిత్తు పాటను ఈ సినిమాలో రీమేక్ చేశారు. ఇందులో తమన్నా నర్తించబోతున్నది. ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. రెండు వారాల షూటింగ్ బ్యాలెన్స్‌గా ఉందని చిత్ర వర్గాలు తెలిపాయి. ఆగస్టులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.