ఇందిరాగాంధీగా విద్యాబాలన్‌

ఇందిరాగాంధీగా విద్యాబాలన్‌

  సినిమా నటి విద్యాబాలన్‌ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీగా మారనున్నారు. అలనాటి శృంగార తార సిల్క్‌స్మిత జీవిత చరిత్రతో తెరకెక్కించిన దర్టిపిక్చర్స్‌ చిత్రంలో నటించి జాతీయ అవార్డును అందుకున్న విద్యాబాలన్‌ తాజాగా ఇందిరాగాంధీ జీవిత చరిత్రలో నటించనున్నారు.మహాత్మాగాంధీ హత్య ఉదంతం అనంతరం అంతకుపైగా కలకలం పుట్టించిన దుర్ఘటన ఇందిరాగాంధీ దారుణ హత్య. 16 ఏళ్లుగా భారత ప్రధాన మంత్రిగా పరిపాలించిన ఏకైక మహిళా ప్రధానిగా కీర్తిగడించిన ఇందిరా గాంధీ 1984 అక్టోబర్‌ 31 ఢిల్లీలోని తన స్వగృహంలో, తన సెక్యూరిటీ చేతే కాల్చబడి నేలకూలిన సంఘటన దేశాన్ని కదలించింది.

కాగా అలాంటి అత్యంత శక్తివంతమైన మహిళా ప్రధానిగా పేరుగాంచిన ఇందిరాగాంధీ జీవిత చరిత్రను బుల్లితెర నిర్మాత, రచయిత్రి సహారిక పుస్తకంగా రచించారు. ఈ నవలను నటి విద్యాబాలన్, రాయ్‌కపూర్‌ పొడెక్షన్స్‌తో కలిసి చిత్రంగా రూపొందించడానికి హక్కులను పొందారు. ఈ విషయాన్ని రచయిత సహారికా తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నట్లు సమాచారం.