ప్రతి అమ్మాయికీ కనెక్ట్‌ అవుతుంది

ప్రతి అమ్మాయికీ కనెక్ట్‌ అవుతుంది

 కీర్తి సురేశ్‌ కొత్త చిత్రం హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌లో గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. దేవుడి చిత్రపటాలపై తీసిన ముహూర్తపు సన్నివేశానికి నందమూరి కల్యాణ్‌ రామ్‌ క్లాప్‌ కొట్టారు. డైరెక్టర్‌ వెంకీ అట్లూరి, నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఎస్‌.హరీష్‌ శంకర్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రూపొందుతోంది. నరేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్‌ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కల్యాణ్‌ కోడూరి బాణీలు సమకూరుస్తున్నారు.

కీర్తి సురేష్‌ మాట్లాడుతూ 'తెలుగులో 'మహానటి' తర్వాత నటిస్తోన్న సినిమా ఇది. మహిళా ప్రధానమైన చిత్రంలో నటించడం చాలా హ్యాపీగా ఉంది. ప్రతి అమ్మాయికీ కనెక్ట్‌ అయ్యే సినిమా. ఎక్కువ భాగం సినిమా యు.ఎస్‌లో చిత్రీకరణ జరుపుకోనుంది. డైరెక్టర్‌ నరేంద్ర మంచి కథను సిద్ధం చేశారు. తప్పకుండా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతాననే నమ్మకం ఉంది' అని అన్నారు. 
దర్శకుడు నరేంద్ర మాట్లాడుతూ '2016 నుండి ఈ కథపై వర్క్‌ చేస్తున్నాను.

తరుణ్‌ నాకు స్క్రిప్ట్‌లో సాయం చేశాడు. అన్ని భావోద్వేగాలూ కలగలిపిన కథ ఇది. ఈ కథకు కీర్తి సురేష్‌ తప్ప మరెవ్వరూ సూట్‌ కారు. 25 శాతం ఇండియాలో, 75 శాతం యు.ఎస్‌లో చిత్రీకరించనున్నాం. ఏప్రిల్‌లో యు.ఎస్‌.షెడ్యూల్‌ ప్లాన్‌ చేస్తున్నాం. ఫిబ్రవరిలో షూటింగ్‌ ప్రారంభమవుతుంది' అని తెలిపారు. నిర్మాత మహేష్‌ కోనేరు మాట్లాడుతూ 'ప్రతి అమ్మాయీ తమ జీవితంలో ఎక్కడో ఒకచోట ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే ఉంటుంది. మహిళలకు కనెక్ట్‌ అవుతుంది. సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం' అని పేర్కొన్నారు.