శ్రావణంలో పెళ్లి చేసుకునే వారికి పట్టు బట్టలిస్తాం

శ్రావణంలో పెళ్లి చేసుకునే వారికి పట్టు బట్టలిస్తాం

   ''శ్రావణ మాసంలో పెళ్లి చేసుకోబోతున్న జంటలకు మా 'శ్రీనివాస కళ్యాణం' టీమ్‌ పట్టు బట్టలు అందించబోతుంది. మీ వెడ్డింగ్‌ కార్డ్‌ పంపిస్తే మేం పట్టు వస్త్రాలు పంపిస్తున్నాం. కొన్ని ఎంపికైన జంటలకు మా యూనిట్‌ నేరుగా పట్టు వస్త్రాలను అందిస్తాం'' అని నిర్మాత దిల్‌ రాజు ప్రకటించారు. ఆయన నిర్మించిన 'శ్రీనివాస కళ్యాణం' ప్రమోషన్‌లో భాగంగా ఆదివారం రాత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. నితిన్‌, రాశీ ఖన్నా, నందితా శ్వేత హీరోహీరోయిన్లుగా సతీశ్‌ వేగేశ్న దర్శకత్వంలో రూపొందింది. ఈనెల 9న సినిమా రిలీజ్‌ అవుతుంది.

దిల్‌రాజు మాట్లాడుతూ 'సతీశ్‌ పాయింట్‌ చెప్పినప్పుడు జయసుధ, నితిన్‌, ప్రకాశ్‌రాజ్‌ అందరూ ఫోన్‌ చేసి కథ బావుందని చెప్పారు. 'శతమానం భవతి' తర్వాత నేను, సతీశ్‌ చేస్తున్న సినిమా ఇది. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకుల రెస్పాన్స్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాం. ఈరోజు మేం పడ్డ కష్టానికి రేపు రాబోయే రిజల్ట్‌ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం' అని అన్నారు. 
నితిన్‌ మాట్లాడుతూ 'నా కెరీర్‌లో టాప్‌ 5 సినిమాల్లో ఇదొకటి అవుతుందని ఆడియో ఫంక్షన్‌ రోజు చెప్పాను. కానీ ఇప్పుడు సినిమా చూసిన తర్వాత టాప్‌ వన్‌ మూవీ అయ్యేలా ఉందనిపిస్తుంది. సినిమా చూసిన తర్వాత అందరూ వారి జీవితాలను కనెక్ట్‌ చేసుకుని ఆనంద భాష్పాలు రాల్చారు. సినిమా తర్వాత దిల్‌రాజుకి మీ బ్యానర్‌లో బెస్ట్‌ హిట్‌ అవుతుందని చెప్పాను. ఈరోజు బయ్యర్లు కూడా అదే చెబుతున్నారు. సతీశ్‌కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాన'ని పేర్కొన్నారు.

చిత్ర దర్శకుడు సతీశ్‌ వేగేశ్న మాట్లాడుతూ సినిమా విడుదల తర్వాత సినిమా గురించి అందులో నటించిన వారి గురించి మాట్లాడితే కరెక్ట్‌గా ఉంటుందని భావిస్తున్నానన్నారు. 
రాశీ ఖన్నా మాట్లాడుతూ 'సినిమా చూసిన తర్వాత చాలా ఎమోషనల్‌ అయిపోయాను. చిన్నపిల్లలు నుండి పెద్ద వారి వరకు అందరికీ సినిమా నచ్చుతుంది. నా కెరీర్‌లో బెస్ట్‌ మూవీ అవుతుంది. ఇందులో భాగమైనందుకు ఆనందంగా ఉంది. సతీశ్‌కి హ్యాట్సాఫ్‌. ఇది సినిమా కాదు. ఓ అనుభూతి' అని చెప్పారు. నందితా శ్వేత మాట్లాడుతూ ' ఇందులో పద్మావతి అనే పాత్ర చేశాను. నా పేవరేట్‌ క్యారెక్టర్‌. వ్యక్తిగతంగా మన పెళ్లి, సంప్రదాయాలు గురించి తెలుసుకున్నాన'ని తెలిపారు. 

జయసుధ తెలుపుతూ 'ప్రేమ, బంధాలు, బాంధవ్యాలు గురించి గొప్పగా చూపించిన చిత్రమిది. నితిన్‌ చక్కగా నటించారు. దర్శకుడు సతీశ్‌గారు ఒక్కొక్కరికీ ఒక్కొక్క చక్కటి సన్నివేశాన్ని క్రియేట్‌ చేశారు. ఇలాంటి సినిమాలో సినిమా నటించినందుకు గర్వంగా ఉంద'ని చెప్పారు.సితార మాట్లాడుతూ ''33 సంవత్సరాలుగా నేను సినిమాలు చేస్తున్నాను. అయితే నా హృదయానికి దగ్గరైన సినిమాలు కొన్ని మాత్రమే. అలాంటి సినిమాల్లో ఇది ఒకటి. సినిమా చూసిన పెళ్లికానీ వారు పెళ్లి చేసుకోవాలనే కోరిక పుడుతుంది'' అని తెలిపారు.