యువత ఆలోచనలకు తగ్గట్టు...

యువత ఆలోచనలకు తగ్గట్టు...

  'ఆర్‌ ఎక్స్‌ 100' ఫేమ్‌ కార్తికేయ హీరోగా జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌, స్ప్రింట్‌ టెలీ ఫిలిమ్స్‌ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు. అర్జున్‌ జంధ్యాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ గురువారం నుంచి ఒంగోలులో ప్రారంభమైంది. ఈ సందర్భంగా హీరో కార్తికేయ మాట్లాడుతూ 'మా 'ఆర్‌ ఎక్స్‌ 100' విడుదలైన తర్వాత చాలా కథలు విన్నాను. వాటిలో నాకు అర్జున్‌ జంధ్యాల చెప్పిన కథ బాగా నచ్చింది. ఉత్తమ కథ అని అనిపించింది. వెంటనే ఓకే చెప్పేశాను. మంచి రోజు చూసి ముహూర్తం షాట్‌ తీశాం. నేటి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుతున్నాం. యువత ఆలోచనలకు తగ్గట్లుగా ఉంటూనే అందరినీ అలరించే అంశాలతో ఈ చిత్రముంటుంద'ని అన్నారు.

దర్శకుడు అర్జున్‌ జంధ్యాల మాట్లాడుతూ 'బోయపాటి శ్రీను దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశాను. కార్తికేయ కథను నమ్మి చేయడానికి ముందుకొచ్చారు. ఆయన వల్లనే ఈ చిత్రం ఇంత త్వరగా పట్టాలెక్కింది. కథానుగుణంగా ఒంగోలులో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాం. కొన్ని యాక్షన్‌ సన్నివేశాలు కూడా తీయనున్నామ'ని చెప్పారు. నిర్మాతలు అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి మాట్లాడుతూ 'నేటి నుంచి ఫిబ్రవరి 8 వరకు ఒంగోలు పరిసరాల్లో తొలి షెడ్యూల్‌ చిత్రీకరిస్తాం. ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను, రెండు పాటలను తెరకెక్కిస్తాం. సినిమా టైటిల్‌ను త్వరలోనే వెల్లడిస్తామ'ని పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: చైతన్య భరద్వాజ్‌, కెమరామెన్‌: 'ఆర్‌ఎక్స్‌ 100' ఫేమ్‌ రామ్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ : జీయమ్‌ శేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : శివ మల్లాల.