పోరాడి ఓడిన భారత్‌

పోరాడి ఓడిన భారత్‌

  ఢిల్లీ: ఫిఫా అండర్‌-17 టోర్నీ ఆతిథ్యం ఇచ్చిన భారత్‌ వరుసగా రెండో ఓటమిని చవి చూసింది. కొలంబియాతో సోమవారం సాగిన మ్యాచ్‌లో స్ఫూర్తిదాయకమైన ప్రదర్శన చేసింది. అయినా ఓటమి తప్పలేదు. కొలంబియా చేతిలో 1-2 తేడాతో భారత్‌ ఓడింది. కొలంబియా జట్టు తరపున 45వ నిమిషంలో స్ట్రైకర్‌ జాన్‌ పెనాలోజా తొలి గోల్‌ చేసి ఆ జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. భారత ఆటగాళ్లు తొలి అర్ధభాగంలోనే ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడులు చేయడంలో విఫలం అయ్యారు. 17వ నిమిషంలో అభిజిత్‌ సర్కార్‌కు గోల్‌ చేసే పెద్ద అవకాశం వచ్చింది. దీన్ని కొలంబియా ఢిపెండర్లు అడ్డుకున్నారు. తొలి అర్ధభాగం ముగిసే సరికి ఇరు జట్లు గోల్సేమీ చేయలేదు. 46వ నిమిషంలో రాహుల్‌ కెనాల్లీ బాల్‌ గోల్‌పోస్టులోకి నెట్టగా అదీ బార్‌కు తగిలి మిస్‌ అయ్యింది. 

రెండో అర్థభాగంలో జీక్సన్‌ సింగ్‌ గోల్‌ పోస్టుకు సమీపంలో వచ్చిన కార్నర్‌ బాల్‌ తలతో నెట్టి తొలి గోల్‌ను అందించాడు. రెగ్యులేషన్‌ టైమ్‌కు 1-1తో భారత్‌ కొలంబియా స్కోర్‌ను సమం చేసింది. మ్యాచ్‌ ముగిసే 7 నిమిషాల ముందు జాన్‌ పెనాలోజా రెండో గోల్‌ను సాధించాడు. తొలి మ్యాచ్‌ల్లో ఓడిన కొలంబియా, భారత్‌ మధ్య పోరు ఆసక్తి కరంగా సాగింది. అమెరికా చేతిలో 0-3తో భారత్‌ పరాజయం పాలైంది. కొలంబియా ఘనా చేతిలో 0-1తో ఓడింది. రెండేళ్ల క్రితం ఈ జట్లు ఫైనల్స్‌ కు చేరాయి. రెండు సార్లు ఛాంపియన్‌షిప్‌ సాధించిన మాలి టర్కీను మట్టి కరిపించడం విశేషం. తొలి మ్యాచ్‌లో వెంట్రుక వాసిలో ఓడినా మాలి తన అద్భుతమైన ఆటతీరుతో గ్రూప్‌లో ప్రి క్వార్టర్స్‌ ఆశలను సజీవంగా నిలుపుకుంది. గ్రూప్‌-బిలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో పరాగ్వే న్యూజిలాండ్‌పై 2-4 గోల్స్‌ తేడాతో జయకేతనం ఎగుర వేసింది.