జామ ఆకుతోనూ ఆరోగ్యం

జామ ఆకుతోనూ ఆరోగ్యం

  జామ పండును అందరం చాలా ఇష్టంగా తింటాం. జామపండులో అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. అలాగే జామ ఆకులో కూడా అనేక ఔషధగుణాలు ఉన్నాయి. ఇవి మన శరీరాన్ని అనేక రుగ్మతల బారి నుంచి కాపాడతాయి. జామ ఆకులు, బెరడు, పువ్వులూ మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో తెలుసుకుందాం. జామ ఆకుల్లో అధిక మొత్తంలో ట్యానిక్స్‌, ఆక్సలేట్స్‌ ఉంటాయి. అందువల్ల నోటిపూత, నోటిలో పుండ్లు, చిగుళ్ల వాపు, గొంతునొప్పి వంటి నోటి సమస్యలతో బాధపడేవారు లేత జామ ఆకుల్ని నమిలినా లేదా లేత ఆకులను నీటిలో వేసి మరిగించి, 

ఆ నీటితో పుక్కిలి పట్టినా ఈ సమస్యలు తగ్గుముఖం పడతాయి. మూడు లేదా నాలుగు జామ ఆకుల్ని నీటిలో వేసి మరగించి, చల్లారాక ఆ నీటిని తాగడం వల్ల జలుబు సంబంధిత సమస్యలు తగ్గుతాయి. జామ ఆకుల కషాయం తీసుకోవడం వల్ల నడుము నొప్పి తగ్గుతుంది. ఈ కషాయాన్ని తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ లాంటి వ్యాధులూ దరిచేరకుండా ఉంటాయి. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ఈ కషాయాన్ని తాగితే మంచినిద్ర పడుతుంది. అంతేకాకుండా జీర్ణవ్యవస్థ తీరుని మెరుగుపరుస్తుంది. శరీరంలో చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించి, శరీరంలో అన్ని అవయవాలకు రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.