అధిక బరువు, డయాబెటిస్‌కు చెక్ పెట్టే ఆహారాలు..!

అధిక బరువు, డయాబెటిస్‌కు చెక్ పెట్టే ఆహారాలు..!

 డయాబెటిస్, అధిక బరువు... ఈ రెండు సమస్యలు నేటి తరుణంలో చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అధిక బరువు ఉన్న వారు చాలా మంది టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్నారు కూడా. ఈ క్రమంలో అధిక బరువును తగ్గించుకోవడం, డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవడం వారికి కష్టంగా మారింది. అయితే కింద సూచించిన ఆహారాలను నిత్యం తీసుకుంటే అధిక బరువును తగ్గించుకోవడంతోపాటు, డయాబెటిస్‌ను కూడా అదుపులో ఉంచుకోవచ్చు. మరి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 


1. జామ పండ్లు 
సీజన్‌లో లభించే పండ్లలో జామ పండ్లు కూడా ఒకటి. జామ పండు పేదవాడి యాపిల్‌గా పేరుగాంచింది. సామాన్య ప్రజలకు కూడా ఇవి చాలా చవకగా లభిస్తాయి. అయితే జామ పండ్లను తరచూ తింటే అధిక బరువును తగ్గించుకోవడంతోపాటు డయాబెటిస్‌ను కూడా నియంత్రణలో ఉంచవచ్చు. 

2. స్ట్రాబెర్రీలు 
స్ట్రాబెర్రీలు తక్కువ గ్లయిసీమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని తింటే అంత త్వరగా గ్లూకోజ్ స్థాయిలు పెరగవు. పైగా వీటిలో ఉండే విటమిన్ సి అధిక బరువును తగ్గించడంతోపాటు డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకునేందుకు సహాయం చేస్తుంది. 

3. యాపిల్ 
యాపిల్ పండ్లలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే ఫ్లేవనాయిడ్లు, బీటా కెరోటీన్ కూడా వీటిలో సమృద్ధిగానే ఉంటాయి. ఇవన్నీ ఆకలిని నియంత్రిస్తాయి. తద్వారా అధిక ఆహారం తినకుండా జాగ్రత్త పడవచ్చు. దీంతో బరువు తగ్గుతారు. అలాగే డయాబెటిస్ కూడా అదుపులో ఉంటుంది. 

4. బొప్పాయి
బొప్పాయిలో సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తాయి. వీటి వల్ల గుండె, మెదడు కణాలు నాశనం కాకుండా ఉంటాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.