ఆరోగ్యానికి 7 అద్భుత‌మైన ఆహారాలు..!

ఆరోగ్యానికి 7 అద్భుత‌మైన ఆహారాలు..!

  మ‌న‌కు తినేందుకు ఎన్నో ర‌కాల కూర‌గాయ‌లు అందుబాటులో ఉన్నాయి. ప్ర‌తి ఒక్క కూర‌గాయ‌, ఆకుకూర‌లోనూ మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన పోషకాలు ఉంటాయి. వాటిలో ఒక్కోదాని వ‌ల్ల ప్ర‌ధానంగా ఒక్కో ర‌క‌మైన ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. అయితే వాటిలో కొన్ని ర‌కాల ఆహారాల‌ను మాత్రం మ‌నం రోజూ తీసుకోవాల్సిందే. దీంతో శారీర‌క‌, మాన‌సిక ఆరోగ్యం మెరుగ‌వుతుంది. శ‌రీరానికి శ‌క్తి ల‌భిస్తుంది. సంపూర్ణ పోష‌ణ క‌లుగుతుంది. అలాంటి 7 అద్భుత‌మైన ఆహారాల‌ను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

 

1. మునగకాయ

దక్షిణ భారతీయుల మది దోచిన కూరగాయల్లో మునగకాయ‌ ఒకటి. ఈ చెట్టు ఉపయోగాలు ఎన్నో..ఎన్నెన్నో.. చెట్టు వేరు నుండి ఆకు వరకు అన్నీ ఉపయోగాలే. పోషకాలు కూడా ఎక్కువే. పంటగా కూడా సాగు చేసే మునగలో మంచి గుణాలు ఎన్నో ఉన్నాయి. వీటిని రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే శ‌రీరానికి పోష‌కాలు బాగా ల‌భించి ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. 
 

2. బీట్‌రూట్

మ‌నం నిత్యం ఆహారంలో చేర్చుకోవాల్సిన కూర‌గాయ‌ల్లో బీట్ రూట్ కూడా ఒక‌టి. బీట్‌రూట్ లో క్యాన్సర్‌తో పోరాడే అద్భుత గుణాలుంటాయి. బీట్‌రూట్‌లోని ఎర్రటి పిగ్మెంట్‌ సహజమైనది. అంతేకాకుండా ఇందులో ఫోలేట్‌లు అధికంగా ఉంటాయి. బీట్‌రూట్‌లో నైట్రేట్‌ నిల్వలు అధికం. ఇవి నైట్రేట్‌ ఆక్సైడ్‌లుగా మారి రక్తప్రసరణ వేగాన్ని పెంచుతాయి. ఫలితంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి.
 

3. క్యాబేజ్

క‌్యాబేజీ ఒక ఆకుకూర. ఎందుకంటే సాధారణంగా క్యాబేజీ మొక్కలో ఆకులతో నిండిన శీర్ష భాగం మాత్రమే తింటారు. ఇంకా క‌చ్చితంగా చెప్పాలంటే వృత్తాకారములో ఉండలా ఉండే లేత ఆకులు మాత్రమే ఉపయోగిస్తారు. కానీ పోషకాలు నిండుగా వున్న క్యాబేజ్‌ను మాత్రం మనం నిర్లక్ష్యం చేస్తాం. ఇందులో ఉండే సల్ఫోరాఫేన్ అనే ఎంజైమ్ క్యాన్స‌ర్‌కు వ్య‌తిరేకంగా పోరాడే గుణాన్ని క‌లిగి ఉంటుంది. క‌నుక క్యాబేజీని రోజూ తీసుకోవాలి. 
 

4. కాలీఫ్ల‌వర్

పచ్చటి ఆకుల మధ్య ముద్దగా కనిపించే తెల్లటి పూలగుచ్చ‌మే కాలీఫ్లవర్‌. ఇది ప్రకృతి సిద్ధమైన ఫ్లవర్‌ బొకేలా ముచ్చటగా ఉంటుంది. కాలీప్లవర్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. విటమిన్‌ బి5, బి6, మాంగనీస్‌, ఫ్యాటీ యాసిడ్లు కూడా ఇందులో ఉంటాయి. అలాగే కార్బోహైడ్రేట్లు, సోడియం మినరల్స్‌ కూడా కాలీఫ్లవర్‌లో లభిస్తాయి. దీంతోపాటు మ‌న శ‌రీరానికి ఎక్కువ ప్రోటీన్ల‌ను ఇవ్వ‌డంలోనూ కాలీఫ్ల‌వ‌ర్ మేలు చేస్తుంది. దీంతో శ‌రీర నిర్మాణం స‌రిగ్గా జ‌రుగుతుంది. 
 

5. కాకరకాయ

కాక‌ర‌కాయ‌ను కేవ‌లం కొంద‌రు మాత్ర‌మే ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇది చేదుగా ఉంటుంది. అయిన‌ప్ప‌టికీ మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను ఇస్తుంది. జ్వ‌రం, ర‌క్త దోషాల‌ను పోగొడుతుంది. డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. నులిపురుగులు న‌శిస్తాయి. శరీరానికి కావల్సిన ఫొలేట్‌, మెగ్నీషియం, జింక్ వంటి పోష‌కాల‌ను అందిస్తుంది. ఎలాంటి వ్యాధులు లేని వారు అనారోగ్యాల బారిన ప‌డ‌కుండా ఉండాలంటే కాక‌ర‌కాయ‌ను రోజూ తినాలి. దీంతో ఐర‌న్ ఎక్కువ‌గా ల‌భించి ర‌క్త‌హీన‌త స‌మ‌స్య పోతుంది. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. కాక‌ర‌కాయ‌ల్లో ఉండే కెరోటినాయిడ్స్ మ‌న‌కు అన్ని విధాలుగా మేలు చేస్తాయి. 

 

6. పాలకూర

పాల‌కూరలోనూ కెరోటినాయిడ్స్ పుష్క‌లంగా ఉంటాయి. దీంతోపాటు విట‌మిన్ సి, ఎ, కె, మెగ్నిషియం, ఫోలిక్ యాసిడ్‌లు పాల‌కూర‌లో ఉంటాయి. ఇవి క్యాన్స‌ర్‌ను అడ్డుకుంటాయి. ఊపిరితిత్తులు, బ్రెస్ట్ క్యాన్స‌ర్ రాకుండా చూస్తాయి. గుండె జ‌బ్బుల‌ను అడ్డుకుంటాయి. పాల‌కూర‌లో ఉండే కాల్షియం, క్లోరిన్‌, పాస్ఫ‌ర‌స్‌, ఐర‌న్‌, మిన‌ర‌ల్స్‌, ప్రోటీన్లు శ‌రీరానికి సంపూర్ణ పోష‌ణ‌ను అందిస్తాయి. 
 

7. చిక్కుడు

కూర‌గాయల్లో చిక్కుడుకు ప్ర‌త్యేక స్థానం ఉంది. ఈ కాయ‌ల‌ను కూర‌గా తిన‌కున్నా వేయించు తిన్నా చాలు అద్భుత‌మైన మేలు క‌లుగుతుంది. క‌నీసం వారంలో రెండు, మూడు సార్ల‌యినా చిక్కుడు కాయ‌ల‌ను తినాలి. వీటి ద్వారా శ‌రీరానికి ప్రోటీన్లు బాగా ల‌భించి శ‌రీరానికి శ‌క్తి వ‌స్తుంది. శ‌రీర నిర్మాణం జ‌రుగుతుంది. చిక్కుడులో ఉండే ఫైబ‌ర్ జీర్ణ స‌మ‌స్య‌ల‌ను పోగొడుతుంది. మ‌ధుమేహాన్ని త‌గ్గించి గుండె జ‌బ్బులు రాకుండా చూస్తుంది.