క్యాప్సికంతో క‌లిగే ప్ర‌యోజ‌నాలు..

క్యాప్సికంతో క‌లిగే ప్ర‌యోజ‌నాలు..

 ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నారింజ రంగుల్లో ఉండే క్యాప్సికం నేడు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ విరివిగా లభిస్తోంది. ఇది కేవలం ఆహారంగానే కాక అనేక రకాల పోషకాలను అందించే ఔషధ పదార్థంగానూ మనకు ఉపయోగపడుతుంది. వివిధ అనారోగ్యాల బారి నుంచి కూడా మనల్ని రక్షిస్తుంది. దీన్ని మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే లాభాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 


1. క్యాన్సర్, పెప్టిక్ అల్సర్, స్త్రీలలో రుతు సంబంధ సమస్యలు, గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి వ్యాధులు రాకుండా చూడడంలో క్యాప్సికం బాగా పనిచేస్తుంది. నొప్పులు, వాపులను తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, అనాల్జెసిక్ గుణాలు ఇందులో ఉన్నాయి. ప్రధానంగా ఆర్థరైటిస్ ఉన్న వారు క్యాప్సికంను తీసుకుంటే నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. 

2. విటమిన్ సి, ఎ, బి1, బి2, బి3, బి5, బి6, బి9, ఇ, కెలతోపాటు డైటరీ ఫైబర్, కాల్షియం, ఐరన్, మాంగనీస్, పాస్ఫరస్, పొటాషియం, జింక్ వంటి ఖనిజాలు క్యాప్సికంలో సమృద్ధిగా ఉంటాయి. దీంట్లో ఉండే ఆల్కలాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్ల లాగా పనిచేస్తాయి. 

3. క్యాప్సికంలో ఉండే ట్యానిన్లు జీర్ణ సంబంధమైన సమస్యలను తొలగిస్తాయి. డయేరియా, డిసెంట్రీ వంటి అనారోగ్యాలకు ఉపశమనాన్ని కలిగిస్తాయి. జీర్ణాశయ పొరను సురక్షితంగా ఉంచుతాయి. 

4. పలు రకాల క్యాన్సర్‌లకు వ్యతిరేకంగా పనిచేసే ఔషధ కారకాలు క్యాప్సికంలో ఉన్నాయి. ఇవి ట్యూమర్లను పెరగనీయకుండా చూస్తాయి. ప్రోస్టేట్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌లు ఉన్నవారు క్యాప్సికంను తరచూ తీసుకుంటే కొంత ఫలితం ఉంటుంది. 

5. క్యాప్సికంలో ఉండే ఫ్లేవనాయిడ్లు శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. ఆయా అవయవాల్లో ఉండే కణాలకు ఆక్సిజన్ సక్రమంగా అందేలా చూస్తాయి. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. 

6. మధుమేహ వ్యాధిగ్రస్తులు క్యాప్సికంను తమ ఆహారంలో భాగం చేసుకుంటే రక్తంలోని చక్కెర స్థాయిలను సులువుగా తగ్గించుకోవచ్చు. ఇన్సులిన్‌ను ఎక్కువగా ఉత్పిత్తి చేసే చర్యలను ఇది ప్రోత్సహిస్తుంది. క్యాప్సికంలోని విటమిన్ సి, ఫైటో కెమికల్స్ ఆస్తమాను తగ్గించేందుకు ఉపయోగపడడంతోపాటు ఇవి దెబ్బ తిన్న మెదడు టిష్యూలకు మరమ్మత్తులు చేస్తాయి. ఎముకలను దృఢంగా ఉంచుతాయి. 

7. యాంటీ ఏజింగ్ లక్షణాలు క్యాప్సికంలో పుష్కలంగా ఉన్నాయి. చర్మానికి కాంతినివ్వడంలో, దాన్ని సంరక్షించడంలోనూ ఇది మెరుగ్గా పనిచేస్తుంది.