చెర్రీలతో మధుమేహం దూరం..!

చెర్రీలతో మధుమేహం దూరం..!

  చూడచక్కని ఎరుపు రంగులో ఉండే చెర్రీ పండ్లను చూడగానే మనకు నోరూరుతుంది. ఎందుకంటే.. వాటి ద్వారా లభించే రుచి అలాంటిది మరి. చాలా మంది చెర్రీలను పలు తీపి వంటకాలలో వేస్తుంటారు. కొందరు ఈ పండ్ల జ్యూస్ తాగేందుకు ఆసక్తి చూపుతారు. అయితే ఇలా కాకుండా చెర్రీ పండ్లను నేరుగా తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయని సైంటిస్టులు చెబుతున్నారు.చెర్రీ పండ్లలో ఆంథోసయనిన్స్ అనబడే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్లోమగ్రంథిలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచేందుకు దోహదం చేస్తాయి. అందువల్ల చెర్రీ పండ్లను తింటే ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగి తద్వారా రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు అదుపులోకి వస్తాయి. చెర్రీ పండ్లను తినడం వల్ల క్లోమగ్రంథి 50 శాతం అదనంగా ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుందట. దీని వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. 

ఇదే విషయాన్ని అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీ అనే జర్నల్‌లోనూ ప్రచురించారు. పలువురు సైంటిస్టులు చేసిన పరిశోధనల సారాంశాన్ని ఇందులో పొందుపరిచారు. కనుక చెర్రీ పండ్లను తరచూ తినడం అలవాటు చేసుకుంటే డయాబెటిస్‌ను అదుపు చేయవచ్చని, దీంతోపాటు అనేక ఇతర లాభాలు కూడా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు.చెర్రీ పండ్లను తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. విటమిన్ సి పుష్కలంగా ఉండడం వల్ల శరీరం ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటుంది. ఇవే కాకుండా ఇంకా అనేక లాభాలు మనకు చెర్రీ పండ్ల వల్ల కలుగుతాయి.