యాలకులతో గొంతు సమస్యలు దూరం

యాలకులతో గొంతు సమస్యలు దూరం

 నేడు చాలామందిని పట్టి పీడిస్తున్న సమస్య నోటి దుర్వాసన. దీనికోసం రకరకాల మౌత్‌వాష్‌లు వాడుతున్నవారూ లేకపోలేదు. దీన్ని పోగొట్టుకునేందుకు యాలకులను నోట్లో వేసుకునేవారూ ఉన్నారు. అయితే రెండు రకాల యాలకులు మనకు అందుబాటులో ఉంటాయి. చిన్న యాలకులు లేదా పెద్ద యాలకులు. తినుబండారాలలో సువాసన కోసం పెద్ద్ద యాలకులను ఉపయోగిస్తారు. చిన్న యాలకులను తీపి పదార్థాలలో కలుపుతుంటారు. మనం తినే ఆహార పదార్థాలలో మాత్రమే వీటిని ఉపయోగిస్తామనుకుంటే పొరపడినట్లే. ఇందులో ఔషధ గుణాలు అధిక మోతాదులో ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో జలుబు, దగ్గు, తుమ్ములు ఎక్కువగా వస్తుంటాయి. ఇలా ఉన్నప్పుడు యాలకులు, అల్లం ముక్క, లవంగం, ఐదు తులసి ఆకులు కలిపి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. 

వాంతులు అయినప్పుడు అరలీటరు నీటిలో ఐదు గ్రాముల యాలకులు వేసి, నీరు సగం అయ్యేంతవరకూ మరగబెట్టాలి. ఆ నీటిని తాగితే వాంతులు తగ్గడంతో పాటు, ఒంట్లో నీరసమూ తగ్గుతుంది. నోట్లో పొక్కులతో బాధపడేవారు యాలకులతోపాటు కలబందను కలిపి పేస్ట్‌లా చేసి, ఈ మిశ్రమాన్ని నాలుకపై కాసేపు అలానే ఉంచుకోవాలి. గొంతులో వాపు వచ్చినప్పుడు ముల్లంగిని నానబెట్టిన నీటితో యాలకులను రుబ్బి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. దగ్గు, గొంతులో మంటతో పాటు బొంగురు పోయినట్లైతే ఉదయం లేవగానే యాలకులను నమిలి తినాలి. తర్వాత గోరువెచ్చని నీటిని తాగాలి. ఇలా తరచూ చేస్తే త్వరగా తగ్గుముఖం పడుతుంది.