13న పెట్రోల్ బంక్ లు బంద్

13న పెట్రోల్ బంక్ లు బంద్

మహారాష్ట్ర: ఈనెల 13వ తేదీన దేశవ్యాప్తంగా పెట్రో బంక్ లు మూసివేయాలని పెట్రోల్  డీలర్లు నిర్ణయం తీసుకున్నారు. 2016, నవంబర్ 4వ తేదీన కేంద్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం డీలర్ల కమీషన్ పెంపుపై ఇంత వరకు నిర్ణయం తీసుకోకపోవటాన్ని తప్పుబట్టారు.

 రోజువారీ రేట్ల మార్పుతో డీలర్ల నష్టాన్ని భర్తీ చేస్తామన్న పెట్రోలియం శాఖ ఇప్పటికే విధివిధానాలను కూడా రూపొందించకపోవటం ఏంటని ప్రశ్నించారు. జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులను తీసుకురావాలని డిమాండ్ చేశారు.

 ఈ డిమాండ్ల పరిష్కారం కోసం ఈనెల 13వ తేదీన దేశవ్యాప్తంగా 54వేల పెట్రోల్ బంకులు 24 గంటలపాటు మూసివేస్తున్నట్లు మహారాష్ట్ర పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉదయ్ లోధ్ ప్రకటించారు.

దీనికి నేషనల్ పెట్రోలియం ఫ్రంట్ తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల డీలర్స్ అసోసియేషన్ కూడా మద్దతు ఇచ్చినట్లు వెల్లడించారు.అప్పటికీ ప్రభుత్వం పరిష్కారం చూపించకపోతే...ఈ నెల 27వ తేదీ నుంచి నిరవధికంగా బంకులు బంద్ చేస్తామని హెచ్చరించారు అధ్యక్షుడు లోధ్.