2019-బీజేపీ ఫినిష్!

2019-బీజేపీ ఫినిష్!

 న్యూఢిల్లీ : దుయి హజార్ ఉన్నీష్, బీజేపీ ఫినిష్ (బెంగాలీ భాషలో 2019-బీజేపీ పని పూర్తి) అన్నదే తమ లక్ష్యమని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. ప్రధాని పదవి కోసం తాను పోటీ పడటం లేదని స్పష్టంచేశారు. ప్రధాని అభ్యర్థిని ప్రతిపక్షాలన్నీ కలిసి ఉమ్మడిగా ఎంపిక చేస్తాయని చెప్పారు. మూడురోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుధవారం పలు ప్రతిపక్ష పార్టీల నేతలను, బీజేపీ అసంతృప్తులను కలుసుకున్నారు.

వచ్చే ఏడాది జనవరి 19న కోల్‌కతాలో నిర్వహించనున్న సభకు రావాలని వారిని ఆహ్వానించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో తలపడేందుకు ప్రతిపక్షాలన్నింటికీ ఒక్కతాటిపైకి తేవడం తన మొదటి ప్రాధాన్యమని మమత చెప్పారు. బుధవారం సాయంత్రం ఆమె కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్‌గాంధీలను కలుసుకున్నారు. అంతకుముందు టీడీపీ, వైసీపీ, డీఎంకే, ఆర్జేడీ, ఎస్పీ, జేడీ(ఎస్) నేతలతో భేటీ అయ్యారు. ప్రధాని అభ్యర్థి ఎవరో తరువాత నిర్ణయిద్దాం. ముందు బీజేపీని ఓడిద్దాం అని ఆమె చెప్పారు. ఎన్నికల్లో కలిసి పోరాడటం గురించి సోనియా, రాహుల్‌తో చర్చించినట్టు తెలిపారు. వర్తమాన రాజకీయాల గురించి చర్చించాం.

భవిష్యత్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అవకాశాలపై మాట్లాడుకున్నాం. 2019లో సమిష్టి నాయకత్వం ఉంటుంది. మా మొదటి ప్రాధాన్యం బీజేపీని తొలిగించడం. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ బలంగా ఉంటే ఆ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతుంది. అని చెప్పారు. బీజేపీ సీనియర్‌నేత ఎల్‌కే అద్వానీతోపాటు ఆ పార్టీలోని అసమ్మతి నేతలు యశ్వంత్ సిన్హా, శత్రుఘ్నసిన్హా, రామ్ జెఠ్మలాని, కీర్తి ఆజాద్‌లను కలుసుకున్నారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన శివసేన నాయకుడు సంజయ్‌రౌత్ వచ్చి మమతను తృణమూల్ కార్యాలయంలో కలుసుకున్నారు. ప్రతిపక్షాలన్నింటినీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకు మమత చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయమని బీజేపీ నుంచి సస్పెండ్ అయిన ఎంపీ కీర్తి ఆజాద్ పేర్కొన్నారు. ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ ఆధారిత ఎన్నికలు నిర్వహించేలా డిమాండ్ చేసేందుకు ప్రతిపక్షాలన్నీ ఎన్నికల సంఘం వద్దకు ఒక ప్రతినిధి బృందాన్ని పంపాలని మమత సూచించారు.